బీజేపీని కొందరికే పరిమితం చేయొద్దు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బీజేపీని కొందరికే పరిమితం చేయొద్దు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • హిందుత్వం కోసమైతే ఆర్ఎస్ఎస్​లో చేరండి
  • ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్లు

వికారాబాద్, వెలుగు: కేవలం హిందుత్వం కోసమే పని చేయాలనుకుంటే బీజేపీని వదిలి ఆర్ఎస్ఎస్​లో చేరాలని, బీజేపీ నాయకులు అన్ని కులాలు మతాల వారిని అక్కున చేర్చుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ వ్యక్తిగత స్వార్థంతో పార్టీని బలహీనం చేస్తున్నారన్నారు. ఆదివారం వికారాబాద్​లో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. కొందరు హిందుత్వం, దేశభక్తిని అడ్డం పెట్టుకొని జిల్లాల్లో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

హిందుత్వం కావాలంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లో చేరి దేశానికి సేవ చేయాలని, అంతే కానీ బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో కొనసాగే అర్హత వారికి లేదన్నారు. అలాంటి వ్యక్తిత్వం, స్వార్థం ఉన్నవారు బీజేపీలో ఉండరాదని స్పష్టం చేశారు. జిల్లాలోని బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లా గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మంచితనం అంటరు, మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటరు..

 ఇలా అయితే పార్టీ బలోపేతం అవుతుందా? దేశంలో మోదీ, జిల్లాలో తాను ఎలాగైనా గెలుస్తం, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? పార్టీలో జిల్లా అధ్యక్ష పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం కోట్లాడడం కాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా నుంచి 540 మంది సర్పంచ్, 5,000 వార్డు మెంబర్లు గెలిచి చూపించాలి. అందుకోసం పార్టీ ఇచ్చిన లక్ష్యాలను సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?” అని విశ్వేశ్వర్​రెడ్డి నాయకులు, కార్యకర్తలను ప్రశ్నించారు.