
చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను ఆయన ఈ ఉదయం కలిశారు. అధికారులు వేధిస్తున్నారని.. అబద్దపు ప్రచారం జరుగుతోందని ఈసీకి ఫిర్యాదు చేశారు.
“రూ.15 కోట్లు దొరికాయని ప్రచారం చేస్తున్నారు. చేవెళ్ళ ప్రజలకు నేనంటే ఏంటో తెలుసు. టీఆర్ఎస్ ఇంటలిజెన్స్ రిపోర్టులో కూడా నా విజయం ఖాయమని తేలింది. అందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల మద్దతు నాకే ఉంది. కొండ సందీప్ అనే వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు మాత్రమే దొరికితే…రూ.15 కోట్లని ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా రూ.15 లక్షలనే చెబుతోంది. దీనిపై విచారణ చేయాలని ఈసీని కోరాం” అని చెప్పారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
చేవెళ్ళ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డిని సంప్రదించకుండా.. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా న్యూస్ ప్రసారం చేయడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్. పోలీస్ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వకుండా అబద్దాలు లీక్ చేస్తున్నారనీ.. వారిపైనా చర్యలు తీసుకోవాలని ECకి ఫిర్యాదు చేశామన్నారు.