రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రధానిని అడ్డుకుంటమంటుండు : కె. లక్ష్మణ్

రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రధానిని అడ్డుకుంటమంటుండు : కె. లక్ష్మణ్

ఢిల్లీ : కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని అంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీని, ప్రధాని మోడీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారని, కేంద్ర నిధులతో అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పారు. ఈ నెల 11,12 తేదీల్లో మోడీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తారని ఇందులో భాగంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని ప్రకటించారు.  

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకుంటున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ ద్రోహులకు ఆయన పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిందని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే కామేడ్లు పనిచేస్తున్నారన్న ఆయన.. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలనను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు.

మోడీ ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తే కేసీఆర్ కు కడుపు మంట ఎందుకని లక్ష్మణ్ ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాల్గో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామన్న కేసీఆర్.. కనీసం ఫసల్ బీమా పథకం కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరాన్ని అభాసుపాలు చేసిన ఆయన.. రూ.30వేల కోట్ల ప్రాజెక్టు అంచనాను రూ.1,20,000కోట్లకు పెంచిన ఘనత దక్కించుకున్నారని అన్నారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు కేసీఆర్ కు కమిషన్ కాకతీయగా మారిందని విమర్శించారు. ఇంటికో ఉద్యోగమిస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.