ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు ప్లాన్: లక్ష్మణ్ 

ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు ప్లాన్: లక్ష్మణ్ 

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులను రెచ్చగొట్టి, రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలు, సంఘాలను ఉసిగొల్పి కేసీఆర్ చేస్తోన్న డ్రామా అందరికీ తెలిసిపోయిందన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకావడం లేదని, ఆయన జీవితమంతా రాజకీయాలకే సరిపోతోందని విమర్శించారు. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6 వేల కోట్లతో పునరుద్ధరించారని తెలిపారు. దీనిపై సంతోషించాల్సింది పోయి కేసీఆర్​కు కడుపు మండుతోందని ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్ తీరును రాష్ట్రంలోని రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం కేవలం ఎరువుల సబ్సిడీపైనే ఎకరాకు రూ.41 వేలు ఖర్చు చేస్తుంటే కేసీఆర్​కు ఏం నొప్పి. చేతనైతే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. కాగా, కేసీఆర్ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టులుగా చెప్పుకునే కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు.