
గద్వాల, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి లబ్ధిదారునికి అందించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో దిశ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయతీరాజ్, శిశు సంక్షేమం, పౌరసరఫరాలు, పరిశ్రమల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లు నిర్దేశించిన లక్షం మేరకు రుణాలు ఇవ్వాలన్నారు. ఎర్రవల్లి, ధరూర్ మండలకేంద్రాల్లో ఎస్బీఐ కొత్త బ్రాంచ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.
డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంక్‌లు, సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వ్యవసాయ శాఖలో 6 వేల మంది రైతుల పంట పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి సాయిల్ హెల్త్ కింద హెల్త్ కార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు. నీతి అయోగ్ లో దేశంలోనే గట్టు బ్లాక్ టాప్–-5 ర్యాంకింగ్ సాధించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ సంతోష్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, దిశ కమిటీ సభ్యులు సరిత, గిరిబాబు, శంకర్, రాజు పాల్గొన్నారు.