
- దేశ సమగ్రతకు భంగం కలిగించే వారికి భారత్ లో చోటులేదు: ఎంపీ రఘునందన్ రావు
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ప్రధాని మోదీని ఎదుర్కోలేక ఇండి కూటమి, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ను కలుపుకుని అక్కడ ఉన్న వారి సహాయంతో అఖండ భారత్ లో ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ సమగ్రతకు భంగం కలిగేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉపసంహరించుకునే ముందు దేశ ప్రజల ఆలోచన తెలుసుకుని మెసులు కోవాలని హితవు పలికారు. పహల్గాం ముష్కరదాడికి ప్రతీకారం తీర్చుకునే విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ దేశం నాది అనుకునే వారిని దేశం గౌరవిస్తుందని, దేశ సమగ్రతకు భంగం కలిగించే వారు దేశం లో ఉండేందుకు అనర్హులని చెప్పారు. పాక్ ఉడత ఊపులకు భయపడేవాళ్లు లేరని, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో భారత్ కు తెలుసున్నారు.