భద్రాద్రికొత్తగూడెం/సత్తుపల్లి, వెలుగు : సింగరేణి మనుగడకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్‌తో పాటు ఏరియాలోని పీవీకే-5 ఇంక్లైన్, ఏరియా వర్క్ షాపులలో సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గెట్టు గెదర్ ప్రోగ్రాంలో ఎంపీతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కొత్త మైన్స్ కోసం తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ విద్యా, వైద్యానికి సింగరేణి యాజమాన్యం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి భవిష్యత్‌తో పాటు కార్మిక సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఈ ప్రోగ్రాంలో సింగరేణి డైరెక్టర్లు డీ. సత్యనారాయణ, వెంకటేశ్వరరెడ్డి, జీఎంలు సామ్యూల్ సుధాకర్, కవితా నాయుడు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు రాజ్ కుమార్, రమణ మూర్తి, సాబీర్‌పాషా, త్యాగరాజన్, పీతాంబరం పాల్గొన్నారు.
యాజమాన్యం తీరుపై ఆగ్రహం..
కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో ఎంపీ పర్యటన ఉందనే సమాచారం ఉన్నప్పటికీ ఆయన హెడ్డాఫీస్‌కు వచ్చిన టైంలో డైరెక్టర్లు, జీఎంలు తొలుత స్వాగతం పలకపోవడం పట్ల ఎంపీ అనుచరులు మండిపడ్డారు. హెడ్డాఫీస్ అలాగే ఒకే కుటుంబం అంటూ చెప్పే సింగరేణి యాజమాన్యం గెట్ టు గెదర్ ప్రోగ్రాంలో ఆఫీసర్లందరికీ ఏసీ రూముల్లో భోజనాలు ఏర్పాటు చేయడంపై కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి వందేళ్ల ఉజ్వల భవిష్యత్‌కు పాటుపడుదాం
సింగరేణి సంస్థ వందేళ్ల ఉజ్వల భవిష్యత్ కు పాటుపడుదామని సీఎండీ బలరాం నాయక్ కార్మికులకు పిలుపునిచ్చారు. సత్తుపల్లిలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన ‘ఉజ్వల సింగరేణి ఉద్యోగుల పాత్ర’ అనే అంశం పై ఏర్పాటుచేసిన కార్మికుల గెట్ టు గెదర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ విస్తరణకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉందన్నారు. ఘననీయమైన ఉత్పత్తి సాధించేందుకు పలు సూచనలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే రాగమయి మాట్లాడి అడిగిన 30 వేల మొక్కలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కిష్టారంలో సీ హెచ్ పీ కాలుష్య నివారణకు, దెబ్బతిన్న ఇండ్లను పునర్నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సదానందం, జీఎం శాలెం రాజు, రాజకుమార్, పీఓలు ప్రహ్లాద్, నరసింహారావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు.