మందమర్రి సింగరేణి ఏరియా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 'టామ్‌కామ్' (TOMCOM) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఎంపీలు ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయ్యారు. వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ వంశీకృష్ణ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. టామ్‌కామ్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న జర్మన్ భాషా శిక్షణా కేంద్రాన్ని నిరుద్యోగ యువత ఒక గొప్ప అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తన జీవితంలో ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. నేను కేవలం పుస్తకాలు చదివి, ఆ నాలెడ్జ్‌తో బ్యాటరీతో నడిచే సరికొత్త బైక్‌లను తయారు చేశాను అంటూ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపారు.
ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని.. దాన్ని గుర్తించి బయటకు తీయాలని వంశీకృష్ణ ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు మాత్రమే సరిపోవని.. అంతర్జాతీయ భాషలపై పట్టు సాధించడంతో పాటు, స్కిల్ డెవలప్‌మెంట్ కూడా చేసుకుంటేనే అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల మరియు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని (Goal) కలిగి ఉండాలని.. అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని ఎంపీ వంశీకృష్ణ యువతకు దిశానిర్దేశం చేశారు.
