
మెదక్, వెలుగు: ఎమ్మెల్యేల తరహాలోనే లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఎంపీలాడ్స్ పథకం కింద ఏటా రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తోంది. సీసీ రోడ్లు, కమ్యూనిటీ బిల్డింగ్ లు, హైమాస్ట్ లైట్లు, డ్రింకింగ్ వాటర్ కోసం బోర్లు తదితర పనుల కోసం ఈ నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఎంపీల ఐదేళ్ల పదవీ కాలంలో ఎంపీ లాడ్స్ నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేసే వీలుంది. కానీ వారు ఆ నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తున్నారు. పదవీ కాలం పూర్తి అయినా మంజూరైన వివిధ పనులు పూర్తి కాలేదు. చాలా పనులు ఇంకా ప్రారంభించలేదు. ఫలితంగా నిధులు వృథా అవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
మెదక్ జిల్లా మెదక్, జహీరాబాద్ లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఇద్దరు ఎంపీలతో పాటు, రాజ్య సభ ఎంపీలు సైతం వారి కోటా నిధులను వివిధ అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారు. రెండు లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో 2016 –-17 నుంచి 2024 –- 25 వరకు రూ.8.31 కోట్ల అంచనా వ్యయంతో 256 పనులు మంజూరయ్యాయి. వాటిలో కేవలం 156 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 27 పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
పూర్తయిన, ప్రగతిలో ఉన్న పనులకు రూ.4.46 కోట్లు ఖర్చయ్యాయి. 73 పనులు అసలు మొదలుపెట్టలేదు. దీంతో ఆయా పనులకు కేటాయించిన లక్షలాది రూపాయల నిధులు వృథా అయ్యాయి. అభివృద్ధి పనులు మంజూరు కావడంతో సంతోషించిన ఆయా ప్రాంత ప్రజలు ఎంపీల పదవీ కాలం ముగిసినప్పటికీ పనులు మొదలుకాకపోవడంతో నిరాశకు లోనయ్యారు.