హుజూరాబాద్ ​బరిలో ఎంపీటీసీలు

హుజూరాబాద్ ​బరిలో ఎంపీటీసీలు

వరంగల్, వెలుగు: హుజూరాబాద్​ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎంపీటీసీలు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా తమకు నిధులు లేవని మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే హుజూరాబాద్​ఎన్నికలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి నిరసన తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్​ వేం వాసుదేవరెడ్డి శుక్రవారం వరంగల్​ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎంపీటీసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సర్కారు స్పందించకుంటే హుజూరాబాద్​ఎన్నికలో మూకుమ్మడి నామినేషన్లు వేస్తామన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు చేసిన మోసాన్ని హుజూరాబాద్ లో ఇంటింటికీ వెళ్లి  ప్రచారం చేస్తామని చెప్పారు. గ్రామాల్లో వార్డు మెంబర్​కు ఉన్న విలువ కూడా తమకు లేదని, కనీసం జీపీల్లో కుర్చీ కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. నిధులు లేకపోవడం, ప్రభుత్వం ఇంపార్టెన్స్​ ఇవ్వకపోవడం వల్ల ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని వాపోయారు. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర కమిటీతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీల ఫోరం వరంగల్​అర్బన్, రూరల్​జిల్లాల అధ్యక్షులు సంపత్, ఎంపీటీసీలు రజినీకర్ రెడ్డి, పోగుల ఇందిరా రాజిరెడ్డి పాల్గొన్నారు.