ఎంఆర్​ఎఫ్​ షేరు అక్షరాలా లక్ష..

ఎంఆర్​ఎఫ్​ షేరు అక్షరాలా లక్ష..

దేశంలోనే మొదటిసారిగా ఒక కంపెనీ షేరు 6 అంకెలను చేరుకుంది. ప్రపంచ సంపన్నులలో ఒకరైన వారెన్ బఫెట్​ కంపెనీ బెర్క్​షైర్​ హాథ్​వే షేరు చాలా ఖరీదైన షేరుగా పేరొందింది. తాజాగా ఇండియాలోని టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్​ఎఫ్​ షేరు అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది. మంగళవారం ట్రేడింగ్​లో ఈ కంపెనీ షేరు రూ. లక్షను తాకింది.

వెలుగు బిజినెస్​ డెస్క్​: టైర్ల తయారీలోని చెన్నై కంపెనీ ఎంఆర్​ఎఫ్​ షేరు ధర మంగళవారం  అక్షరాల లక్ష రూపాయలను తాకింది. దలాల్​ స్ట్రీట్​ చరిత్రలో ఒక కంపెనీ షేరు లక్ష ధర పలకడం ఇదే మొదటిసారి. చాలా ఏళ్లుగా ఎంఆర్​ఎఫ్​ షేరు ధర ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతోంది. ఎంఎన్​సీ హనీవెల్​ ఆటోమేషన్​ షేరు రూ. 41,000 ధరతో ఈ జాబితాలో రెండో ప్లేస్​లో నిలుస్తోంది. అత్యంత ఖరీదైన షేర్ల జాబితాలో ఆ తర్వాత పేజ్​ ఇండస్ట్రీస్​, 3ఎం ఇండియా, శ్రీ సిమెంట్​, నెస్లే కంపెనీలు ఆ తర్వాత ప్లేస్​లలో నిలుస్తున్నాయి. షేరు ధరకి– షేరు విలువకి చాలా తేడా ఉంటుంది. పైన జాబితాలోని కంపెనీల షేర్ల రేట్లే ఎక్కువ. షేర్ల విలువను అనేక పారామీటర్ల ఆధారంగా లెక్కకడతారు. మార్కెట్​ క్యాపిటలైజేషన్​, ప్రైస్​ టూ ఎర్నింగ్స్​(పీ ఈ ) రేషియో, ప్రైస్​ టూ బుక్​ వాల్యూ రేషియో, ఇన్వెస్టర్ల అంచనాలు, గ్రోత్​ అవకాశాలు వంటి వాటి ద్వారా షేర్ల విలువను లెక్కిస్తారు.

ఫండమెంటల్స్​ ఆధారంగా ఎంఆర్​ఎఫ్​ షేర్లను అమ్ముకోవాలని చాలా బ్రోకరేజ్​లు సెల్​ రేటింగ్స్​ ఇచ్చాయి. అయితే, మరోవైపు టెక్నికల్​ ఎనలిస్టులు మాత్రం ఈ షేరు ఇంకా దూసుకెళ్లే ఛాన్స్​లు ఉన్నాయని చెబుతున్నారు.

ఎంఆర్​ఎఫ్​ షేరుకు రూ. 95,000 ధర స్ట్రాంగ్​ సపోర్టు  లెవెల్​. దీపావళిలోపు ఈ షేరు రూ. 1.25 లక్షలను  కూడా తాకే ఛాన్స్​ ఉంది.

వైభవ్​ కౌషిక్​,రీసెర్చ్​ ఎనలిస్ట్​, జీసీఎల్​ బ్రోకింగ్