మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చేపల మార్కెట్లు సందడిగా మారాయి. మృగశిర రోజున చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయనే నమ్మకంతో ప్రజలు పెద్ద సంఖ్యలో చేపల కోసం బారులు తీరారు. పలు చెరువులు, కుంటల వద్ద మత్స్యకారులు చేపలు పడుతున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
చెరువుల వద్ద చేపలు కిలో రూ.120కు విక్రయించగా, బహిరంగ మార్కెట్లలో రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.300 వరకు ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేజీ చేపలను రూ.250, బొమ్మ చేపలను రూ.450 చొప్పున విక్రయించారు. గణపురంలో ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన 12 కిలోల భారీ బొచ్చ చేప విశేషంగా ఆకట్టుకుంది.
హైదరాబాద్‌లోని రాంనగర్ చేపల మార్కెట్ లో కొర్రమీనులు రూ.500 నుంచి రూ.700 వరకు ధర పలికాయి. కొనుగోలుదారులు మోసపోకుండా తూనికల కొలతల శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
