‘సీతారామం’ తర్వాత ప్రేక్షకులు తనను ఇంకా వైవిధ్యమైన పాత్రల్లో చూడాలనుకుంటున్నారని, అందుకే మనసుకు దగ్గరైన సినిమాలపై దృష్టి పెట్టానంటోంది మృణాల్ ఠాకూర్. ‘హాయ్ నాన్న’లో అలాంటి క్యారెక్టర్ చేశానని చెప్పింది. నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ చెప్పిన విశేషాలు.
ఇది చాలా అద్భుతమైన కథ. నేటితరాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. నా పాత్ర కూడా న్యూ ఏజ్ అమ్మాయిగా ఉంటుంది. యష్ణ పాత్రలో కనిపిస్తా. అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాది. తండ్రి, కూతురు మధ్య హ్యూమన్ రిలేషన్స్‌ని, ఎమోషన్‌ని ప్రజెంట్ చేసేలా సినిమా ఉంటుంది.
ఒక ఆర్టిస్ట్‌గా ఎలాంటి సినిమా చేస్తున్నామో మన మనసుకి తెలిసిపోతుంది. కథని పాత్రలని బలంగా నమ్మి అంతే నిజాయితీతో చేసిన సినిమా ఇది. నేనే కాదు.. నాని గారు, శౌర్యువ్, మా డీవోపీ షాను, సంగీత దర్శకుడు హేషమ్, కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్ ఇలా టీం అంతా చాలా నిజాయితీగా పని చేశాం. అలాగే మోహన్ గారు, విజయేందర్ రెడ్డి గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వీరితో మరిన్ని చిత్రాలు చేయాలనుంది.
నాని వండర్‌ఫుల్ కో స్టార్. ఆయనతో నటిస్తుంటే పెర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ అవుతుంది. శౌర్యువ్ విజన్, అప్రోచ్ చాలా క్లారిటీగా ఉంటాయి. కొత్త దర్శకుడితో పని చేస్తున్నామనే భావన రాలేదు. తన దర్శకత్వంలో మళ్ళీ నటించాలని ఉంది. బేబీ కియారా చాలా క్యూట్. సీన్‌తో పాటు అందులో ఉన్న ఎమోషన్‌ను చాలా బాగా అర్ధం చేసుకుంటుంది. ఇందులో రాక్ స్టార్ తనే. తన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నాని, కియారా మధ్య సీన్స్ ఆడియెన్స్‌కు విజువల్ ఎమోషనల్ ట్రీట్ ఇస్తాయి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తున్నా. అలాగే హిందీ సినిమాల షూటింగ్ జరుగుతోంది. తెలుగులో కొన్ని కథలు వింటున్నా.ప్రేక్షకులకు నా పేరు గుర్తులేకపోయినా పర్లేదు కానీ సీత, యష్ణ లాంటి పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా.
