
కడలూరు (తమిళనాడు): లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతనంటే ప్రాణం ఇచ్చే వీరాభిమానులూ చాలా మందే కనిపిస్తారు. మహీపై ప్రేమను వాళ్లు వివిధ రూపాల్లో చూపిస్తుంటారు. ఒకరు ఒంటి నిండా మహీ టాటూస్ వేయించుకుంటే, మరొకరు ధోనీ పేరు కనిపించేలా హెయిర్ కట్ చేసుకుంటారు. ఈ విషయంలో కాస్త డిఫరెంట్‌గా ఆలోచించిన ఓ వీరాభిమాని తన ఇంటిని ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ పసుపు రంగుతో ముంచేశాడు. తమిళనాడు కడలూరుకు చెందిన గోపీకృష్ణన్ తన ఇంటికి మొత్తం యెల్లో కలర్ పెయింట్ వేయించాడు. అంతేకాదు బయటి గోడలపై ధోనీ చిత్రాలు, సీఎస్‌కే లోగో, విజిల్ పోడు అనే ట్యాగ్‌లైన్స్‌ను కూడా వేయించి ఇంటికి ‘హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్’ అని రాయించుకున్నాడు. దీని కోసం అతను ఒకటిన్నర లక్షలు ఖర్చు చేశాడు. చాలా ఏళ్ల నుంచి దుబాయ్‌లో పని చేస్తున్న గోపీకృష్ణన్ ఆ నగరంలో ధోనీ, సీఎస్‌కే ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ప్రస్తుతం కరోనా కారణంగా స్వరాష్ట్రానికి తిరిగొచ్చాడు. ‘ధోనీ ఆటను లైవ్‌లో చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఈ సీజన్‌లో ధోనీ బాగా ఆడడం లేదని వస్తున్న విమర్శలు కూడా బాధ పెడుతున్నాయి. నేనైతే గెలిచినా ఓడినా అతనికే మద్దతిస్తా’ అని గోపీ చెప్పాడు.