వీడియో: షోరూంని తలపిస్తున్న ధోని గ్యారేజ్.. మీరూ చూడండి

వీడియో: షోరూంని తలపిస్తున్న ధోని గ్యారేజ్.. మీరూ చూడండి

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్కెట్‌లోకి వచ్చిన బైకుల్లో కాస్త ప్రత్యేకంగా కనిపిస్తే చాలు.. అది ధోని గ్యారేజ్‌లో ప్రత్యక్షమవుతుంది. అంత పిచ్చి అన్నమాట. అంతేకాదు తాను మొదటిసారిగా కొన్న బైక్ దగ్గర్నుంచి, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' రూపంలో వచ్చిన బైక్స్ దాకా అన్నింటినీ సేకరించి.. వాటి కోసం తన ఇంట్లో ఓ ప్రత్యేకమైన గ్యారేజీ కట్టించి భద్రపరిచాడు. 

ధోని గ్యారేజీ గురుంచి ఇప్పటికే పదుల సంఖ్యలో వీడియోలు వచ్చినప్పటికీ.. అవన్నీ అస్పష్టంగా ఉండేవి. కానీ మొదటిసారి ఓ స్పష్టమైన వీడియో ప్రపంచం ముందుకొచ్చింది. భారత మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి దీన్ని తెరపైకి తెచ్చారు. 90ల నాటి ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు రాంచీ పర్యటన సందర్భంగా ధోనీ ఫామ్‌హౌస్‌ని సందర్శించారు. ఈ క్రమంలో మాహీ గ్యారేజీని చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రూ.30వేల నుండి రూ.50 లక్షల వరకూ.. 

ధోనీకి బైక్‌లంటే ఎంత ఇష్టమో వెంకటేష్ ప్రసాద్ షేర్ చేసిన ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ధోని సేకరించిన వాటిలో ఒక్కో దానికి.. ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఆ ప్రత్యేకతల గురించి ప్రపంచానికి తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. ధోని గ్యారేజీలో ఉన్న బైకుల్లో రూ.30వేల మొదలు రూ.50 లక్షల ఖరీదైనవి వరకూ అన్నీ ఉన్నాయి.  

ధోనీ బైక్ కలెక్షన్‌లో కొన్నింటి వివరాలు.. 

  • కవాసకి నింజా H2: రూ.35 లక్షలు
  • కన్ఫిడరేట్ X132 హెల్‌క్యాట్: రూ.47 లక్షలు
  • హర్లే డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్: రూ.21.99 లక్షలు
  • డుకాటీ 1098: రూ.35 లక్షలు
  • నార్టన్ జుబ్లీ 250: రూ.3 లక్షలు
  • యమహా ఆర్‌డీ 350: రూ.30 వేలు
  • టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్  310: రూ.5 లక్షలు

గ్యారేజీ మెకానిక్‌ ధోని

ధోని గ్యారేజీలో బైకులే కాదు.. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు కార్లు చూడొచ్చు. వీటిలో కొన్నిటిని దిగుమతి చేసుకోగా, మరికొన్నిటిని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేశాడు. ఈ కార్లు, బైకులకు యజమాని ధోనీనే.. మెకానిక్‌ ధోనీనే. ఇంజిన్ ఆయిల్ మార్చటం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వంటివి తానే సరి చేస్తాడట. ఏదేమైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. ధోని గ్యారేజీని మ్యూజియంగా మార్చాలని కామెంట్స్ చేస్తున్నారు.