అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని..ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ నుంచి కూడా ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2023 సీజనే ధోనికి చివరి సీజన్ అని ఈ మధ్య వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి, ఈ క్రమంలో ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో చెప్పేశాడు.
ధోని రిటైరయ్యేదెప్పుడు..
ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సురేష్ రైనా..జియో సినిమాలో ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ధోని రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్న నేపథ్యంలో..ఈ అంశంపై రైనా ధోనీతో మాట్లాడినట్లు వెల్లడించాడు. ఐపీఎల్ నుంచి ఎప్పుడు రిటైర్ అవుతావని ధోనిని అడిగినట్లు రైనా చెప్పాడు. అయితే దానికి సమాధానంగా ధోనీ చెన్నై తరపున మరోసారి ట్రోఫీ గెలవాలని ఉందని బదులిచ్చినట్లు తెలిపాడు. ఈ సీజన్ లో ఐపీఎల్ ట్రోఫి సాధించినా కూడా...మరో సీజన్ ఆడతా అని ధోని అన్నట్లు రైనా పేర్కొన్నాడు.
ఫ్యాన్స్ ఖుష్..
ఐపీఎల్ రిటైర్మెంట్ పై సురేష్ రైనాకు ధోని క్లారిటీ ఇవ్వడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరో సీజన్ ఆడతానన్న ధోని వ్యాఖ్యలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ లో చెన్నై అద్బుతంగా ఆడుతుందని...ఇదే ఆటతీరును ప్రదర్శిస్తే..ఖచ్చితంగా మరోసారి ట్రోఫి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏ నిర్ణయం తీసుకోలేదు..
ఐపీఎల్ రిటైర్మెంట్పై ధోని కూడా ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశాడు. తను రిటైర్‌మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఒకవేళ తీసుకున్నా సీజన్ మధ్యలో అనవసర ప్రకటనలు చేసి ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టబోనని చెప్పేశాడు.