పాటల మాగాణం తెలంగాణ. ఏ ఊరికి వెళ్లినా పాటలే మనకు ఎదురొస్తాయి. అలాంటి పాటల పూదోటలో చెరగని సంతకం ప్రజావాగ్గేయకారుడు ముచ్చర్ల సత్యనారాయణ అలియాస్ సంగంరెడ్డి సత్యనారాయణ. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి పాటల పునాది తక్కువ. అలాంటి తక్కువమందిలో పదునైన వాగ్గేయకారుడు ముచ్చర్ల. ఆయన ఒక నాటక, బుర్రకథ కళాకారుడిగా జీవితం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి నవ యువకుడిగా అనేక కవితలు, పాటలు రాశాడు.
ముచ్చర్ల పాటల్లో ప్రజల పలుకుబడి ఉంది. తెలంగాణ యాస ఉంది. పాలకులను సూటిగా ప్రశ్నించే తత్వం ఉంది. అందుకే ఆయనొక తిరుగుబాటు కవిగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తెలంగాణ నేలకు ఉన్న రాజ్యధిక్కార సంస్కృతికి అసలు సిసలు వారసుడు ముచ్చర్ల. ఆయన గొంతెత్తడానికి ముందు వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల కేంద్రంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో బండి యాదగిరి, సుద్దాల హనుమంతు వంటి ప్రజా కవులు పదునైన పాటలు రాశారు. ప్రజలను మేల్కొలిపి ఉద్యమానికి సన్నద్ధం చేశారు. ఈ ప్రభావం ముచ్చర్ల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంది. అందుకే ఆయన బండి యాదగిరి తదితర ప్రజాకవులకు కొనసాగింపుగా అద్భుతమైన పాటలు, కవితలు రాశాడు.
నిజానికి ఆంధ్రా దోపిడీ మీద తొలిరోజుల్లో పాటలు ఎక్కువగా లేవు. అలాంటి సమయంలో 1960ల నాటి తెలంగాణ ఉద్యమానికి పాటలను అందించిన ప్రజావాగ్గేయకారులు వేళ్ల మీదకే పరిమితం. వచన కవులు కవిత్వం ద్వారా తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. స్వరాష్ట్ర కాంక్షను బలంగా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ‘ప్రభాతభేరీలు’ పేరుతో హైదరాబాద్ పాత నగరంలో ఎస్వీ సత్యనారాయణ, అనుముల శ్రీహరి తదితరులు పాటలు, కవితలు ఆలపించారు. అంతకంటే ముందే 1950ల్లోనే వరంగల్ కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ కోసం గొంతెత్తిన ప్రజావాగ్గేయకారుడు ముచ్చర్ల సత్యనారాయణ.
తెలంగాణ నేల మీద పాటకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
ఉద్యమాలకు ప్రజల మద్దతు కూడగట్టింది కూడా పాటే. ఆ పాట లేని పోరాటాన్ని మనం ఊహించలేం. ప్రజాయుద్ధనౌక గద్దర్, గూడ అంజన్న, మాస్టార్జీ, గోరటి వెంకన్న, జయరాజు, మిత్ర తదితర వాగ్గేయకారుల సృజనలో పాట పదునెక్కింది. వీరందరి నేపథ్యం వేరు. ముచ్చర్ల సత్యనారాయణ పాటగానిగా మారడం వెనకాల ఉన్న ప్రభావాలు వేరు. పై వాగ్గేయకారులంతా విప్లవ పార్టీల సాంస్కృతిక సంఘాల శిక్షణలో అందివచ్చారు. ముచ్చర్లకు అలాంటి ప్రత్యక్ష అనుబంధం లేదు. చిన్ననాటి నుండి తాను పాటతో పాటే పెరిగిండు. ముఖ్యంగా నాటకాలు, బుర్రకథలు తన యవ్వన కాలంలో భాగమయ్యాయి. ఆయన అట్లా కళల పట్ల ఆకర్షితుడు కావడానికి తెలంగాణ గ్రామీణ వ్యవస్థలో ఉన్న భజన సంప్రదాయం కొంతవరకు దోహదం చేసింది. ఆ జానపద కళాకారుడు ప్రజా కళాకారుడు కావడానికి మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే దారి వేసింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూస్వామ్య పెత్తనానికి ఎదురు నిలిచింది పాట.
1940ల నాటికే ‘సంఘపోళ్ల’ పేరుతో కమ్యూనిస్ట్ దళాలు ఊళ్లల్లోకి వచ్చాయి ఊరూర దొరలకు వ్యతిరేకంగా అనేక పాటలు వచ్చాయి. అట్లా వచ్చినవే ‘బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి’, ‘పల్లెటూరి పిలగాడ పాలబుగ్గల జీతగాడ’వంటి పాటలు. ఈ పాటలు తెలంగాణ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ప్రజల నాలుకల మీద నడయాడాయి. ఆ ప్రభావం మనకు ముచ్చర్ల సత్యనారాయణ మీద కూడా కనిపిస్తుంది. పాలకుల దుర్మార్గాలను ఎండగట్టి, ప్రజలను మేల్కొలిపేది పాటే అనే భావన ముచ్చర్లకు ఒక సాంస్కృతిక అవగాహనను అందించింది. అందుకే ఆయన పాటను శక్తివంతంగా ప్రయోగించాడు. పలు పదునైన పాటలు రాసి జనాన్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సన్నద్ధం చేశాడు.
‘‘తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు/మోసపోతివా నీవు గోసపడుతావు/చావు బ్రతుకుల మధ్య సాగుతున్నది నావ/ఏదరికి చేర్చేదో సోదరా నీ నావ/ఆంధ్రులతో కలిసి నీ వడగంటి పోతావో/ప్రత్యేకమై ఉండి బ్రతుకు సాగిస్తావో/ప్రతిభ చూపిస్తావో” (ధిక్కార కెరటం. పుట. సంఖ్య. 46) అంటూ 1954లో ఉమ్మడి రాష్ర్టం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే రాశాడు. ఆంధ్రాతో తెలంగాణ కలిసిపోతే జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన క్రాంతదర్శి ఆయన. అందుకే ఆంధ్రులతో కలిస్తే నువ్వు అడుగంటి పోతావు అన్నాడు. ఈ పాట ఆనాటి విద్యార్థులను రగిలించింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోకుంటే ఆగమైపోతామన్న హెచ్చరిక చేసింది.
‘‘సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు/అధికార దాహంతో అంధులే అయ్యినారు/పార్టీ మేలు కొరకు ప్రజలను బలి ఇస్తారు/నీతిలేని రాజనీతి వారిది చూడు’’(అదేపుట.)అంటూ నాడు కమ్యూనిస్ట్‌లు సైతం విశాలాంధ్రకే జై అన్న దుర్మార్గాన్ని ఎండగట్టాడు. కమ్యూనిస్ట్‌లు కూడా అధికారం కోసం తెలంగాణను ఆక్రమించాలని చూస్తున్నారనే కుట్రను బయటపెట్టాడు ముచ్చర్ల. ఆంధ్రప్రదేశ్ అవతరణను పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ముచ్చర్ల మాత్రం దీనిని ఒక కుల రాజకీయాల కుట్రగా తేల్చిపడేశాడు. ‘‘రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత/సంఘ బహిష్కృతుల స్వార్థమే/కుల రాజకీయాల కుట్రయే ఇదియంత/ప్రజల పాడు చేసి బ్రతుకగలరెన్నాళ్లు”(అదేపుట.)అంటూ సరికొత్త భాష్యాన్ని చెప్పాడు.
కొంతమంది స్వార్థపరులు తమ కుల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇట్లా బరితెగించారన్న అభిప్రాయాన్ని, ముచ్చర్ల పై విధంగా పాటీకరించాడు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును మొదటినుండి వ్యతిరేకిస్తూ వచ్చాడు ముచ్చర్ల. ఆఖరికి ఆంధ్రా పెద్దమనుషులకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆయన రాష్ర్ట విలీనానికి ముందు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు. అలాంటి ప్రజా కంటకుడిని 1958లో ప్రశంసిస్తూ సర్వర్ డండా అనే ఒక జానపద కళాకారుడు గొప్పగా కీర్తిస్తూ పాట పాడాడు.
‘‘ఆంధ్రాకే తుమ్ హోగామా/పోలీసు కీ డైరీమే/దండెకీ పాహిరిమే/న పులిస్టాప్ న కామా/సంజీవరెడ్డి మామా సంజీవరెడ్డి మామా...” అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. తెలంగాణను నిండా ముంచుతున్న ఒక ప్రజా వ్యతిరేక పాలకున్ని అట్లా ప్రశంసించడం చూసిన ముచ్చర్లకు కడుపు రగిలిపోయింది. నీలం సంజీవరెడ్డి దుర్మార్గాలను ఎండగడుతూ ఆసువుగా పాటందుకున్నాడు. ‘‘సంజీవరెడ్డి మామా – సంజీవా రెడ్డి మామా/అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామా/ సునోజి మేరా గానా – కహతాహే తెలంగాణ/ఇన్ సాన్ తుమ్కో మానా/ఐసా కబీనా జాన బతాదియా జమాన/బందర్ కార్నామా–సంజీవరెడ్డి మామా” (ధిక్కార కెరటం, పుట.సంఖ్య.52) అంటూ ముచ్చర్ల పాడిన పాట 1958 ఉద్యమాన్ని ఒక కుదుపు కుదిపేసింది.
ఎక్కడ మీటింగ్ జరిగినా ఈ పాట మార్మోగింది. సంజీవరెడ్డికి ముచ్చెమటలు పట్టించింది. ‘‘వాడు నన్ను పాడేగా ఫైజామా అంటాడా?, డిఫమేషన్ కేసు వేస్తా’’అన్నాడు. అంతగా ఒక రాష్ర్ట ముఖ్యమంత్రినే గజగజలాడించింది.1962లో ‘‘రత్తమ్మా కనక రత్తమ్మా’’అంటూ సాగే మరోపాటను రాశాడు. స్థానికురాలు కాని కనక రత్తమ్మ అప్పటికే, కాంగ్రెస్ పార్టీ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఇక రెండోసారి హన్మకొండ నియోజకవర్గం నుండి బరిలో నిలపడానికి సిద్ధమైంది. ఈ విషయం నచ్చని ముచ్చర్ల ఆమె మీద అత్యంత వ్యంగ్యోక్తితో పాట రాశాడు.
‘‘రత్తమ్మా కనక రత్తమ్మా/మా పల్లెవారికే నీవు కొత్తమ్మా/బస్తీలో పుట్టినావు – బస్తీలో పెరిగినావు/పట్టు చీరకట్టినావు – ఖద్దర్ బురఖా వేసినావు/కాఫీ నీళ్లు తాగుతావు – కార్లెక్కి తిరుగుతావు/మా పల్లెటూరి కష్టాలు రత్తమ్మా/నీ కంటికేడ కనిపిస్తయి అత్తమ్మా”(ధిక్కార కెరటం.పుట.సంఖ్య.68)అంటూ ఆమె అభ్యర్థిత్వాన్ని ఎద్దేవా చేశాడు ముచ్చర్ల. అప్పటికే ఆమె మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిని కూడా ముచ్చర్ల పాటలో చక్కగా చేర్చాడు. తరతరాలుగా దళితులను అంటరానివాళ్లుగా చూస్తున్న వ్యవస్థ మీద కూడా ముచ్చర్ల తన కలాన్ని ఎక్కుపెట్టాడు.
‘‘కలదమ్మా.../కలదమ్మా కలదు అంటరానితనం/మాల మాదిగలకున్.../ఆలకింపువమ్మా భారతీ.../తరాలు మారిన రాత మారని మాల మాదిగల్ వక్కానింప సిగ్గయ్యేడిన్...”(ధిక్కార కెరటం.పుట.సంఖ్య.73) అంటూ దళితుల పక్షాన గొంతెత్తాడు ముచ్చర్ల. తెలంగాణ సాంఘిక వ్యవస్థలో అణగారిపోతున్న దళితుల మీద అప్పటికి పెద్దగా పాటలు లేవు. కులాన్ని ఒక సమస్యగా ఏ కమ్యూనిస్టు కళాకారుడు గుర్తించలేకపోయాడు. ముచ్చర్ల మాత్రం తన స్వంత గ్రామమైన ముచ్చర్లలో ఒక సర్పంచ్‌గా చూసిన అనుభవం నుండి దళితబాంధవుడిగా నిలిచాడు.
ఇక తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో మర్రి చెన్నారెడ్డి మీద సైతం పాటతో విరుచుకుపడ్డాడు. నూకల రామచంద్రారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వారు ముందుకు రావాలని గుర్తు చేశాడు. అట్లా1969 ఉద్యమం అనంతరం తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటుచేశాడు మర్రి చెన్నారెడ్డి. అప్పటి దాకా కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం ఒక పార్టీనే స్థాపించాడు. దానిని గమనించిన ప్రజలు ఆయనకు 1971 ఎన్నికల్లో 10 లోక్‌సభ స్థానాల్లో గెలిపించారు. అయినా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ వాదానికి కట్టుబడి ఉండకుండా నీరుగారిపోయాడు. దాంతో ప్రజల్లో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానిని గమనించిన ముచ్చర్ల ఆయన మీద కూడా ఒక మంచి పాటను రాశాడు.
‘‘రావోయ్ రావోయ్ మర్రి చెన్నారెడ్డి/ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి/రావోయ్ రావోయ్ రామచంద్రారెడ్డి/ఇకనైనా రావేమి మూగ చంద్రారెడ్డి/నీ కొరకు తెలంగాణ కలలు కంటుందిరా/కొదమ సింహమై కొరడా చేపట్టరా”(ధిక్కార కెరటం.పుట.116)అంటూ తెలంగాణ సాధన కోసం సంసిద్దం కమ్మని మర్రి చెన్నారెడ్డికి, నూకల రామచంద్రారెడ్డికి సైతం ముచ్చెర్ల పిలుపును ఇచ్చాడు. ఈ పాటకు ప్రజల్లో విశేష స్పందన లభించింది. 1971 ఎన్నికల్లో సైతం ముచ్చెర్ల పలు మీటింగ్‌ల్లో పాల్గొని ప్రసంగించాడు. ఆ సందర్భంగా సైతం కొత్త పాటను రాశాడు. అది తెలంగాణలో హోలీ సందర్భంగా పాడుకునే పాట శైలిలో సాగుతుంది.
‘‘జాజిరి జాజిరి జాజిరి జాజూ/ఎన్నడు కాలుతదో ఆంధ్రుల కాడు/వద్దు వద్దంటే వచ్చిరి నాడు/వచ్చినవారు తెచ్చిరి కీడు/జాజిరి జాజిరి జాజిరి జాజూ...” (జై తెలంగాణ వారపత్రిక, 10.03.1973)అంటూ 1968లో రాసిన పాటలో నాటి ఆంధ్ర అక్రమ వలసలను వ్యతిరేకించాడు. నిజానికి తెలంగాణ అనేది ఒక అంతర్గత వలస ప్రాంతంగా మారింది. ఆంధ్రా నుండి బాగుపడి కోట్లకు పడగెత్తడానికి వచ్చిన ప్రతీ వ్యాపారికి, హైదరాబాద్ అనేది ఒక బంగారు గుడ్లు పెట్టే బాతులా కనిపించింది. అలాంటి అవకాశ వాదులను ముచ్చెర్ల ఎండగట్టాడు. ఈ పాటలో ముచ్చర్ల ‘ఎన్నడు కాలుతదో ఆంధ్రుల కాడు’అంటాడు. ఇది ఒక ధిక్కారమైన వ్యాఖ్య. ఇట్లా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆంధ్రులకు వ్యతిరేకంగా నోరు విప్పడం అంటే సాహసమే. ఆ సాహసానికే పూనుకున్నాడు ముచ్చెర్ల.
ఇట్లా పాటను ఆయా సందర్భాలకు అనుగుణంగా సృజించి ప్రయోగించాడు ముచ్చర్ల. సామాన్యుడి ధర్మాగ్రహానికి ఒక రూపమొస్తే అది కచ్చితంగా ముచ్చెర్ల పాటలెక్కనే ఉంటది. తెలంగాణ పల్లె ప్రజల మాండలికంలో సజీవమైన పోలికలతో ఎవరికి తగలాలో వారికి తగిలేలా పాటలు రాశాడు. అదే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ముచ్చర్ల పాటలన్నీ చరిత్ర సాక్ష్యాలు. వ్యక్తుల గురించి రాసినా అది ఆ కాలాన్ని కూడా పట్టి చూపెట్టింది. రాజకీయ పరిణామాలు ఎటువైపు నుండి ఎటు మళ్లుతున్నాయో చక్కగా చిత్రించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన పాటలను లోతైన అధ్యయనం చేయాలి. అందుకు యూనివర్సిటీలు పూనుకోవాలి. ఎన్ని పాటలు రాసిండన్నది కాదు. ఎలాంటి పాటలు రాశాడు. అవి ప్రజలను ఏమేరకు కదిలించాయో ముఖ్యం. ఆ కోణంలో ముచ్చర్ల పాటను చూడాలి. తాను కళాకారుడు కావడం వల్లనే అద్భుతమైన గుర్తింపును పొందాడు.
ఆ నేపథ్యమే గాయకుడిని నాయకుడుని చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలోనే రవాణాశాఖ మంత్రిని చేసింది. పాటతో అసెంబ్లీలో అడుగుపెట్టిన నాయకుడు ముచ్చర్ల. పదవులు, అధికారం ఏమాత్రం అతడిలో కించిత్ గర్వాన్ని తీసుకురాలేదు. ఇట్లా తెలంగాణ విముక్తి కోసం తన వంతు పాత్రను పోషించిన ఒక వాగ్గేయకారుడి జీవితకాలపు కృషిని తెలంగాణ సమాజం సరిగా పట్టించుకోకపోవడం విషాదం. ఇప్పటికైనా ముచ్చర్ల సాహిత్య కృషిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉంది. ముఖ్యంగా విలువలతో కూడుకుని, నిజాయితీగా జీవించిన ఆయన జీవితగాథ యూనివర్సిటీల్లో సిలబస్‌లో పెట్టాల్సిన గ్రంథం. అలాగే ఆ మహాకళాకారుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముచ్చర్ల స్థానాన్ని ముచ్చర్లకు కేటాయించాలి. ప్రజాకవుల సరసన నిలుపదగిన మట్టిబిడ్డ ఆయన. ఆయన పాటకు, మాటకు, జీవితాచరణకు నాజై భీమ్‌లు!!
(జనవరి 21న ముచ్చర్ల జయంతి సందర్భంగా..)
- డా. పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమి
యువ పురస్కార గ్రహీత, 77026 48825
