
- రిటైర్డ్ ఎంప్లాయ్ కృషితో ఊరిలో చైతన్యం
- గ్రామంలో ఎవరు చనిపోయినా కండ్లు దానం
- ఇప్పటివరకు 59 మందికిపైగా ఐ డొనేషన్, వంద మందికిపైగా చూపు
- అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్న గ్రామస్తులు
హనుమకొండ, వెలుగు: ఇంట్లో కొద్దిసేపు కరెంట్ పోతేనే ఏమీ కనిపించక ఉక్కిరిబిక్కిరవుతుంటాం. ఇక కంటికి చూపే లేకపోతే జీవితాంతం చీకటే! ఇలా ప్రపంచాన్ని చూడలేకపోతున్న ఎంతోమందికి హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామం చూపును ప్రసాదిస్తోంది. ఊరిలో ఎవరు చనిపోయినా కండ్లు దానం చేసే మహత్కార్యానికి ఓ రిటైర్డ్ ఎంప్లాయి శ్రీకారం చుట్టి, గ్రామస్తుల్లోనూ స్ఫూర్తిని రగిలించగలిగారు.
తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం చొరవతో ఊరి వాళ్లంతా అదే పద్ధతి పాటిస్తున్నారు. ఇప్పటికే అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ టాప్ లో నిలవగా, నేత్ర దానంలో ముచ్చర్ల ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం. దీంతోనే ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారులు కూడా గ్రామాన్ని సందర్శించి, నేత్రదాతల కుటుంబ సభ్యులను సత్కరించారు.
ఒక్కరితో మొదలైన ఉద్యమం..
ముచ్చర్లకు చెందిన మండల రవీందర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డీఈఈగా పని చేశారు. సొంతూరిలో సేవాకార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో గుడి, బడిని బాగు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేత్రదానంతో సమాజంలో కండ్లులేని వాళ్లకు చూపు తెప్పించవచ్చనే ఆలోచనతో అటువైపు అడుగులు వేశారు. 2013లో ఆయన తల్లి మండల లక్ష్మి చనిపోగా, నేత్రదానానికి తన కుటుంబం నుంచే శ్రీకారం చుట్టారు.
ఆ తర్వాత గ్రామస్తులను ప్రోత్సహించడంతోపాటు 2019లో మరణించిన తన తండ్రి వీరయ్య కండ్లనూ డొనేట్ చేశారు. రవీందర్ తోపాటు గ్రామానికి చెందిన బోగి సుజాత, బండ సాయిరెడ్డి, కంచనకుంట్ల మల్లారెడ్డి, రాజమణి, స్వప్న ఇలా మరికొందరు కమిటీలా ఏర్పడి ఊరిలో ఎవరు చనిపోయినా కండ్లు డొనేట్ చేయించేలా కుటుంబ సభ్యులను ఒప్పిస్తున్నారు. వీరి కృషికి తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ సభ్యులు కూడా జత కలవగా, అప్పటి నుంచి నేత్రదాన కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నారు.
వంద మందికిపైగానే చూపు..
గ్రామంలో దాదాపు 4 వేల వరకు జనాభా ఉండగా, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్ తోపాటు వ్యవసాయం చేసే ఎంతోమందికి నేత్రదానంపై అవగాహన కల్పించడంలో రవీందర్ టీమ్ తోపాటు తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం అధ్యక్షుడు కొన్ రెడ్డి మల్లారెడ్డి, ఇతర సభ్యులు సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు కేవలం ఒక్క ముచ్చర్ల నుంచే 59 మంది వరకు కండ్లు దానం చేయగా, వారి వల్ల దాదాపు 108 మందికి చూపు దక్కినట్లయ్యింది.
అదే దారిలో మరికొన్ని ఊర్లు..
నేత్రదానంలో ముచ్చర్ల ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోగా, రవీందర్ తోపాటు కొన్ రెడ్డి మల్లారెడ్డి చొరవతో మరికొన్ని ఊర్లు కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నాయి. రవీందర్ బంధువు సహకారంతో నడికూడ మండలం సర్వాపురం నుంచి 10, రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి నుంచి మరో 10 మంది వరకు నేత్రదానం చేశారు. ఇదిలాఉంటే నేత్రదానం చేసిన మృతుల కుటుంబాలకు తగిన గౌరవం దక్కడంతోపాటు గుర్తింపు వచ్చేలా తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
దాతల పేరుతో అభినందన పత్రాలు ఇవ్వడంతోపాటు వారి సంస్మరణ సభలు కూడా చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. దాతల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వడం వల్ల మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తుల కండ్లతో మరికొందరికి చూపును ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
అనుమానించినా ఆగలేదు..
చనిపోయిన వ్యక్తి నేత్రదానం చేయడం వల్ల ఇంకో ఇద్దరు వ్యక్తులు ప్రపంచాన్ని చూడగలుగుతారు. అందుకే మా గ్రామస్తులందరినీ నేత్రదానం వైపు మళ్లించే ప్రయత్నం చేశాను. కొన్ని సందర్భాల్లో మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా, వారి బంధువులు ఒప్పుకోక ఇబ్బందులు ఎదురయ్యేవి. కొంతమంది మమ్మల్ని అనుమానించారు. అయినా మేం ఆగిపోలేదు. చనిపోయిన వ్యక్తి కండ్లతో మరికొంతమందికి చూపును తెప్పించేందుకు కృషిని కొనసాగించాం. నేత్రదానంలో ముచ్చర్లకు మంచి పేరు రావడం గర్వంగా ఉంది. - మండల రవీందర్, రిటైర్డ్ డీఈఈ, ముచ్చర్ల
మరిన్ని గ్రామాలు ఆదర్శం కావాలి
దేశంలో ఎంతోమంది చూపులేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి చూపునిచ్చేందుకు కృషి చేస్తున్న ముచ్చర్ల గ్రామం అందరికీ ఆదర్శణీయం. మరణించినవారి కండ్లతో మరికొంతమందికి చూపు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. నేత్ర, అవయవ, శరీర దానంతో మరిన్ని గ్రామాలు ఆదర్శంగా నిలవాలి. కొన్ రెడ్డి మల్లారెడ్డి, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం అధ్యక్షుడు