గట్టమ్మ మాదంటే మాదే.. గొడవకు దిగిన ముదిరాజ్ లు, నాయకపోడ్ లు

గట్టమ్మ మాదంటే మాదే.. గొడవకు దిగిన ముదిరాజ్ లు, నాయకపోడ్ లు

ములుగు, వెలుగు : ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లి మాకే చెందుతుందంటే... మాకు చెందుతుందంటూ జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ లు, ఆదివాసీ నాయకపోడ్ లు ఘర్షణకు దిగారు. దీంతో పలువురు మహిళలకు గాయాలు అయ్యాయి. ఆదివాసీ నాయక పోడ్ లు గట్టమ్మను తమ కులదైవంగా భావించి నిత్యం పూజలు చేస్తున్నారు. అయితే గట్టమ్మ ఆలయం జాకారం గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందని, తామే అసలైన పూజారులం అంటూ గ్రామానికి చెందిన పలువురు ముదిరాజ్ లు సోమవారం ఆలయానికి వచ్చి అక్కడి మహిళలతో గొడవ పడ్డారు. విషయం తెలుసుకున్న నాయకపోడ్ లు సైతం గట్టమ్మ ఆలయం వద్దకు వచ్చారు. 

దీంతో ఇరు వర్గాలు కొట్టుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ రంజిత్​కుమార్​గట్టమ్మ ఆలయం వద్దకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం వారిని స్టేషన్ కు పిలిపించి తమ వద్ద ఉన్న పత్రాలను చూపించాలన్నారు. జాకారం ముదిరాజ్​లు ఇటీవల హై కోర్టు నుంచి స్టే ఆర్డర్స్​ ఉన్నాయని చెప్పగా వాటిని పరిశీలించి ఆర్డర్స్ లో ఆలయాన్ని ఎండోమెంట్​ పరిధిలోకి తీసుకెళ్లొద్దని మాత్రమే ఉందని, నాయకపోడ్​లకు వ్యతిరేకంగా స్టే ఇవ్వలేదని స్పష్టం చేశారు. తమ తాతల కాలం నుంచి గట్టమ్మకు పూజలు చేస్తున్నామని, 2002, 2009, 2014లలో సైతం తామే పూజారులుగా కొనసాగామని నాయక పోడ్ లు వివరించారు. 

ములుగు పరిధిలో ఉన్న గట్టమ్మ ఆలయాన్ని కావాలనే జాకారంలో కలిపారని  నాయకపోడ్​ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆరోపించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారన్నారు. ఎండోమెంట్​ పరిధిలోకి తీసుకువచ్చి గట్టమ్మ ఆలయాన్ని పాత పద్ధతిలో ములుగు గ్రామపంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్​చేశారు. ఆలయ వివాదం తేలే వరకు గొడవలకు దిగొద్దని, ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని సీఐ రంజిత్ కుమార్​హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులను మోహరించారు. కాగా ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఫిర్యాదు తో ఈర్ల చేరాలు, మాజీ సర్పంచ్​రమేశ్, రఘు, అయిలయ్య, మరికొంతమంది మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.