మహా శ్రీమంతుడు.. ముఖేశ్ అంబానీ

మహా శ్రీమంతుడు.. ముఖేశ్ అంబానీ

ఒక చోట నుంచి ప్రయాణం మొదలెట్టిన అన్నదమ్ములు… 14 ఏళ్లు తిరిగేసరికి ఒకడు కుబేరుడిగానూ, రెండోవాడు మామూలు కోటీశ్వరుడిగానూ మిగిలారు. ధీరూభాయ్​ అంబానీ పెద్ద కొడుకు ముఖేశ్​ అంబానీ ఈ రోజున ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో టాప్​ పొజిషన్​లో నిలబడ్డారు. ఆయన ఆస్తి 3,80,700 కోట్ల రూపాయలు. వరుసగా ఎనిమిదోసారి ఈ క్రెడిట్​ దక్కించుకున్నారు. అంతేకాదు, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​) సీఎండీ హోదాలో తన ఇయర్లీ ప్యాకేజీని 11 కోట్ల రూపాయల దగ్గర ఆపుజేయించారు. గడించడంలో ఎంత షార్ప్​గా ఉంటారో, లైఫ్​ని ఎంజాయ్​ చేయడంలో అంత ఫ్యామిలీపర్సన్​గా ఉంటారు ముఖేశ్​ అంబానీ!

. డ

బ్బే డబ్బును పుట్టిస్తుందనుకుంటారు సహజంగా. ధీరూభాయ్​ అంబానీ కొడుకులిద్దరి విషయంలో ఈ నానుడి పనికి రాదు. పెద్ద కొడుకు ముఖేశ్​ అంబానీ (62 ఏళ్లు) ఈ రోజున 3 కోట్ల 80 లక్షల 700 కోట్ల రూపాయల ఐశ్వర్యంతో ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో టాప్​ పొజిషన్​లో ఉన్నాడు. రెండో కొడుకు అనిల్​ అంబానీ (60) చాలావరకు సంపదను పోగొట్టుకుని 1,000 కోట్ల రూపాయలతో అసలు సూపర్​ రిచ్​ జాబితాలోనే లేకుండా పోయాడు. ముఖేశ్​ సంపద పోయినేడాదితో పోలిస్తే 3 శాతం పెరగగా, అనిల్​ సంపద పోయినేడాది 19,500 కోట్ల రూపాయలుండగా, ప్రస్తుతం వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువకు పడిపోయింది. ఐఐఎఫ్​ఎల్​ వెల్త్​ హ్యూరన్​ ఇండియా రిచ్​ లిస్ట్​–2019లోగల మొత్తం 953 మంది లక్ష్మీపుత్రుల పేర్లలో ముఖేశ్​ అంబానీ టాప్​లో ఉన్నారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ (ఆర్​ఐఎల్​)​ చైర్మన్ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ (సీఎండీ)​ హోదాలో వరుసగా ఎనిమిదోసారి ముఖేశ్​ తన టాప్​ పొజిషన్​ని నిలబెట్టుకోగలిగారు.

ఇండియాకి ఫైనాన్షియల్​ కేపిటల్​గా భావించే ముంబై నుంచే ఎక్కువమంది (26 శాతం) బిలియనీర్లు రావడం ఈ ఏడాదిలో మరో చెప్పుకోదగ్గ విషయం. ముంబై అడ్రస్​గా లక్షల కోటీశ్వరులు 246మంది ఉన్నారు. ఆ తర్వాత న్యూఢిల్లీ నుంచి 175 మంది, బెంగళూరు నుంచి 77 మంది ఉన్నారు. రిచెస్ట్​ పర్సన్స్​ నివసించే లిస్టులో పోయినేడాది న్యూఢిల్లీ, బెంగళూరు నగరాల వాటా 59 శాతం కాగా, ఈ ఏడాది 35 శాతానికి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడిగా గుర్తింపుపొందిన అలీబాబా గ్రూప్​ హోల్డింగ్​ వాణిజ్యవేత్త జాక్​ మాని ముఖేశ్​ దాటేశారు.

రిలయన్స్​ ఇండస్ట్రీస్​కి బ్యాక్​బోన్​గా నిలబడ్డ ముఖేశ్​ అంబానీ సామ్రాజ్యం ఆయిల్​ నుంచి టెలికం రంగం వరకు విస్తరించింది. తండ్రి ధీరూభాయ్​ హయాంలో టెక్స్​టైల్​ బిజినెస్​ ఏరియాలో పేరు తెచ్చుకున్న రిలయన్స్​ని ముఖేశ్​ అనూహ్యంగా ఎవరూ అందుకోలేని ఎత్తుకు తీసుకెళ్లారు. మార్కెట్​ క్యాపిటలైజేషన్​ (ఎం క్యాప్​)లో టాటాలను సైతం ఆర్​ఐఎల్​ దాటివెళ్లింది.  రిలయన్స్​లో ముఖేశ్​ అంబానీ, అతని ఫ్యామిలీ మొత్తం 43 శాతం వాటాని కంట్రోల్​ చేస్తోంది. ఇక, వ్యక్తిగతంగా ఆయనకు డివిడెండ్లు, సీఎండీ హోదాలో జీతం, డైరెక్టర్​గా మీటింగ్​లకు వచ్చినప్పుడు ఇచ్చే ఫీజులు, రిలయన్స్​ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లో వాటా, గ్యాస్​ పైప్​లైన్లు సహా కొన్ని విలువైన ప్రైవేటు పెట్టుబడుల్లో వచ్చే రాబడి దండిగా ఉంటుంది.  అయినప్పటికీ తన జీతాన్ని 11 ఏళ్లుగా పైసా పెరగనివ్వలేదు. 2007 నుంచి ఇప్పటివరకు ఆర్ఐఎల్​ సీఎండీ హోదాలో ఏడాదికి 15 కోట్ల రూపాయల  వేతనాన్ని తీసుకుంటున్నారు. ఇన్నేళ్లలోనూ ఇతర ఫుల్​టైమ్​ డైరెక్టర్ల రెమ్యూనరేషన్​ మాత్రం పెరుగుతూ వచ్చింది. ఆర్​ఐఎల్​లో 72.31 లక్షల షేర్లు ముఖేశ్​ పేరుమీద ఉన్నట్లుగా ఈ మార్చి 31న విడుదల చేసిన కంపెనీ పోర్టుఫోలియో ద్వారా తెలుస్తోంది.

ధీరూభాయ్​ అంబానీ 1958లో, బహుశా ముఖేశ్​ ఏడాది పిల్లాడిగా ఉన్న రోజుల్లో… సొంతంగా వ్యాపారాన్ని ఆరంభించారు. మొదట్లో ఆయన సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఫ్యాబ్రిక్స్, టెక్స్​టైల్​ రంగంలోకి ప్రవేశించారు. ఇండియాలో మధ్యతరగతికి ’80వ దశకంలో షేర్​ మార్కెట్​ రుచి చూపించిన క్రెడిట్​ ధీరూభాయ్​కే దక్కుతుంది. అప్పటి వరకు షేర్​ మార్కెట్​, షేర్ల కొనుగోలు, అమ్మకాలు వగైరాలన్నీ పెద్ద పెద్ద బ్రోకరేజీ సంస్థలు నడిపించేవి. దేశంలో ఆర్థిక సరళీకరణ, లిబరలైజేషన్​ పాలసీ రావడానికి చాలా ముందుగానే ధీరూభాయ్​ షేర్​ బూమ్​ తీసుకొచ్చారు. తండ్రి స్థాపించిన కంపెనీలో ముఖేశ్​, అతని తమ్ముడు అనిల్ డైరెక్టర్లుగా ప్రవేశించారు. 1990లో పెట్రో కెమికల్స్​, రిఫైనరీ రంగాల్లోకి రిలయన్స్​ వెళ్లాలనుకున్నప్పుడు ముఖేశ్​ ముందుండి నడిపించారని చెబుతారు.  ఆ తర్వాత టెలికం, రిటైల్ మార్కెట్​లోకికూడా రిలయెన్స్ వెళ్లింది.  గుజరాత్​లోని జామ్​ నగర్​లో రిలయన్స్​ ఏర్పాటు చేసిన పాతాళగంగ ప్రాజెక్ట్​ ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ కాంప్లెక్స్​. దీని వెనుక పూర్తిగా ముఖేశ్​ తెలివితేటలే ఉన్నాయంటారు.

ధీరూభాయ్​ 2002లో చనిపోయాక, ఆస్తి తగాదాలేర్పడ్డాయి. 2005లో తల్లి కోకిలా బెన్​ సామరస్యంగా అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకం జరిపారు. ముఖేశ్​ వాటాకింద రిఫైనింగ్​, పెట్రోకెమికల్స్​, ఆయిల్​, గ్యాస్​, టెక్స్​టైల్స్​ వంటివి; అనిల్​ వాటాకి కనస్ట్రక్షన్​, టెలికమ్యూనికేషన్స్​, అసెట్​ మేనేజిమెంట్​, ఎంటర్​టైన్​మెంట్​, పవర్​ ప్లాంట్లు వచ్చాయి.

ముఖేశ్​ తన తెలివితేటలతో రిలయన్స్​ కంపెనీని జాగ్రత్తగా నడిపిస్తూ, వచ్చిన అవకాశాల్ని జారవిడుచుకోకుండా విస్తరిస్తూ వచ్చారు.  ఒక చిన్న సైజ్​ బ్రాడ్​బాండ్​ స్పెక్ట్రమ్​ని కొనుగోలు చేసి టెలికం మార్కెట్​లోకి ప్రవేశించి… మొత్తం వ్యాపారాన్నే హైరేంజ్​కి తీసుకెళ్లిపోయారు. రిలయన్స్​ టెలికం మార్కెట్​ వేల్యూ ప్రస్తుతం 10 కోట్ల డాలర్లు (దాదాపు 710 కోట్ల రూపాయలు) స్థాయికి వెళ్లింది.  రిలయన్స్​ జియో ఇన్ఫోకం ఈ రోజున ప్రతి ఇండియన్​ అరచేతిలోనూ సిమ్​ రూపంలో ఉంది.

అంబానీ ఇల్లు..వరల్డ్​ కాస్ట్​లీ ప్రాపర్టీ

ఆసియాలోనే అందరి కన్నా ఎక్కడ డబ్బున్న వ్యక్తి ముఖేశ్​ అంబానీ. ‘అంత శ్రీమంతుడి ఇల్లు ఎంత ఖరీదు ఉంటుందో!!’ అనే ఆసక్తి సహజం. దానికి తగ్గట్లే ఆయన తన ఇంటిని కట్టించుకున్నారు. అంబానీకి దేశంలో ఎన్నో విలువైన, విలాసవంతమైన నివాసాలు ఉన్నా ముంబైలోని ‘ఆంటిలియా’నే అసలైన ఆణిముత్యంగా చెప్పొచ్చు. 27 ఫ్లోర్లు గల ఈ ఇల్లు ప్రపంచంలోనే రెండో కాస్ట్​లీ ప్రాపర్టీ. లండన్​లోని బ్రిటన్​ రాణికి చెందిన బకింగ్​హాం ప్యాలెస్​ది మొదటి స్థానం. ఆంటిలియా నిర్మాణానికి అంబానీ పెట్టిన ఖర్చు ఒక 100 కోట్ల​ యూఎస్​ డాలర్లు. ఈ ఇంట్లో 600 మంది స్టాఫ్​తోపాటు మూడు హెలీప్యాడ్లు; మూడు ఫ్లోర్లలో గార్డెన్, సిమ్మింగ్​ పూల్స్​, బాల్​ రూమ్స్​, ప్రత్యేకించిన పూజా మందిరం ఉన్నాయి.

వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో..

  • 1957: ఎడెన్​లోని ఆయిల్​ బంక్​లో పనిచేసే ధీరూభాయ్​ అంబానీ 1957లో ఇండియాకి తిరిగొచ్చారు. ఇండస్ట్రియల్​ సెక్టార్​లో అంబానీ శకం ప్రారంభమైంది.
  • 1966: ‘రిలయన్స్​ కమర్షియల్​ కార్పొరేషన్’తో పాలిస్టర్​ బిజినెస్​ మొదలుపెట్టారు.
  • 1977: మొదటిసారిగా ఐపీవోకి వెళ్లారు.
  • 1985: రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​గా మార్పు.
  • 1996: ‘ఆర్​ఐఎల్​’ ను ఇంటర్నేషనల్​ క్రెడిట్​ రేటింగ్​ ఏజెన్సీలు తమ లిస్ట్​లో చేర్చాయి. ఇండియాలో ఈ ఘనత సాధించిన ఫస్ట్​ ప్రైవేట్​ సెక్టార్​ కంపెనీగా రిలయన్స్​ రికార్డ్​.
  • 1995‌-96: టెలికం సెక్టార్​లోకి ప్రవేశం.
  • 1998-99: ‘రిలయన్స్​ గ్యాస్​’ సిలిండర్ల ప్రవేశం.
  • 2001: ఆర్​ఐఎల్​​, పెట్రోలియం లిమిటెడ్​.. దేశంలోని అతి పెద్ద కంపెనీలయ్యాయి.
  • 2002: కేజీ బేసిన్​లో గ్యాస్​ నిక్షేపాలు.
  • 2005-06: పవర్​ జనరేషన్​, డిస్ట్రిబ్యూషన్​, ఫైనాన్షియల్​, టెలీకమ్యూనికేషన్స్​లోకి విస్తరణ.
  • 2006: ఆర్గనైజ్డ్​ రిటైల్​ మార్కెట్​లోకి ప్రవేశం.
  • 2013: రిలయన్స్​ ఫుట్​ప్రింట్, ట్రెండ్స్​, డిజిటల్, హోమ్​ కిచెన్​ వంటి పేర్లతో స్టోర్లు తెరిచారు.
  • 2016: రిలయన్స్​ సామ్రాజ్యంలోకి కొత్త తరం. ముఖేష్​ అంబానీ కూతురు ఇషా, కొడుకు ఆకాశ్​ తెచ్చిన జియో ప్రొడక్ట్​ రాత్రికిరాత్రే టెలికం రంగం రాతను మార్చింది.