ముక్కోటి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ముక్కోటి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు.  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు.  ముక్కోటి ఏకాదశికి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాద్రి శ్రీరామచంద్రుడి ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కరీంనగర్ జిల్లా  చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.వైకుంఠ ఏకాదశి పర్వదినంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  శ్రీ వేంకటేశ్వర స్వామి అలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.  నిర్మల్ జిల్లాలో  వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

సంగారెడ్డి జిల్లాలోని వెంకటేశ్వర ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన ముస్తాబు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు  దర్శనం చేసుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ పూజల్లో  ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూర్ ఎమ్మేల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు, వివేక్ కుమారుడు వంశీ క్రిష్ణలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయంలో పల్లకి సేవ ద్వారా  ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఉత్తర ద్వారం ద్వార పెద్ద సేవపై హరి హరులు  భక్తులకు దర్శనం ఇచ్చారు.  ఈ ఊరేగింపులో  రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట ఆలయం, చెర్వుగట్టు, మట్టపల్లి, పానగల్, నల్లగొండ పాతగుట్టలో శనివారం ఉదయం 6:42 నుండి 8 గంటల వరకు, భద్రాద్రిలో ఉదయం 5 గంటల నుంచి 6గంటల వరకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో యాదాద్రిలో ఉత్తర ద్వారం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రిలో ఉత్తర ద్వార దర్శనం తర్వాత 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించనున్నామని ఈవో రామకృష్ణారావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో నిత్యం నిర్వహించే లక్షపుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన కైంకర్యాలను ఒక్కరోజు రద్దు చేశారు.

నేటి నుంచి అధ్యయనోత్సవాలు 

యాదాద్రిలో శనివారం సాయంత్రం నుంచి 28వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికోసం 6 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. నిత్యం నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు కైంకర్యాలను తాత్కాలికంగా రద్దు చేశారు.