
ములకలపల్లి, వెలుగు : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు అంతరించి పోకుండా కాపాడుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. గురువారం మండలంలోని తిమ్మంపేట గ్రామపంచాయతీ రాజీవ్ నగర్ లో గిరిజనులు జరుపుకొంటున్న భూమి పండుగకు ఆయన హాజరయ్యారు. పండుగలో భాగంగా గిరిజన పెద్దలు యువకులతో కలిసి విల్లంబులతో కోడిగుడ్డును పూజించి, దానిని వారి దేవుడు ఎదురుగా పెట్టి బాణాలతో పగలగొట్టారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన పెద్దలు, యువతి, యువకులు అంతా కలిసి నేటికీ పాత తరం సంప్రదాయాల ప్రకారం భూమి పూజ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
గిరిజన పెద్దల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు మర్చిపోకుండా ఏ కార్యం తలపెట్టిన ముందుగా గిరిజనుల సాంప్రదాయ ప్రకారం వారి దేవతలను పూజించి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, పంటలు పండించుకోవడానికి కరెంటు బోరుమోటర్లు అవసరం ఉన్నదని, పోడుపట్టాలు కూడా సరిగా అందడం లేదని గిరిజనులు పీవో దృష్టికి తీగా, అవన్నీ అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి పాల్గొన్నారు.