భారతదేశంలోనే అతిపెద్ద బంగారం స్మగ్లింగ్ కేంద్రంగా ముంబై ఎయిర్ పోర్టు

భారతదేశంలోనే అతిపెద్ద బంగారం స్మగ్లింగ్ కేంద్రంగా ముంబై ఎయిర్ పోర్టు

ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డ్ స్మిగ్లింగ్ కు కేరాఫ్ గా మారింది. గడిచిన 11 నెలల్లోనే రూ.360కోట్ల విలువైన 604కేజీల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో 374కేజీలు, చెన్నైలో 306కేజీల బంగారు ఇంతకుమునుపు పట్టుబడగా.. వాటిని మించి ముంబయి ఎయిర్ పోర్టులో స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఎయిర్ పోర్టులో ఏప్రిల్ 202 నుంచి ఫిబ్రవరి 2023మధ్య కాలంలో ఇది మరింత ఎక్కువైందన్నారు. 

ప్రస్తుతం మార్కెట్ లో బంగారానికి అత్యంత విలువ ఉన్న నేపథ్యంలో ముంబయి నగరం బంగారం స్మగ్లర్లకు రవాణా కేంద్రంగా మారింది. ఆభరణాల వ్యాపారులతో సహా అనేక సిండికేట్‌లు రాకెట్‌దారులకు ఆర్థికసాయం చేస్తున్నాయని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.  మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై లోనూ ఈ తరహా స్మగ్లింగులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ గతేడాది 55 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదు కాగా, 124 కిలోల బంగారం పట్టుబడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం దిగుమతి సుంకాన్ని 7.5శాతం నుంతి 12.5శాతానికి పెంచడం వల్ల కొవిడ్ కు ముందు కాలంతో పోలిస్తే 2022లో దేశంలో బంగారం అక్రమ రవాణా 33శాతం పెరిగి, 160టన్నులకు చేరుకుంది. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతుండడంతో అక్రమ రవాణా ద్వారా వచ్చే లాభం 15శాతం నుంచి 20శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కొన్ని నిబంధనలు విధించింది. పురుషులు 20 గ్రాములు, స్త్రీలు 40 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఇతర దేశాల నుంచి తీసుకురావడానికి చట్టబద్దంగా అనుమతినిచ్చింది.

ప్రతి సంవత్సరం మొత్తం 720 టన్నుల వరకు భారత్ కు బంగారం వస్తోందని, అందులో 380టన్నులు 15శాతం దిగుమతి సుంకం, 3శాతం ఐజీఎస్టీతో చట్టబద్దంగా దిగుమతి అవుతోందని ఆభరణాల వ్యాపారులు చెబుతున్నారు. మిగతా 340 టన్నుల బంగారం అక్రమంగా రవాణా చేయబడుతోందంటున్నారు. భారత్ లో స్మగ్లింగ్ 2021 22 సంవత్సరానికి గానూ 37శాతం మయన్మార్ నుంచి, 20 శాతం పశ్చిమాసియా నుంచి అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే భారత్ లో బంగారం స్వాధీనం రేటు మాత్రం కేవలం 2శాతమేనని డబ్యూజీసీ తెలిపింది.