
ముంబై: ఉరి వేసుకొని ఓ యువ క్రికెటర్ బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఆలస్యంగా బయటపడింది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో నివసించే కరణ్ తివారీ(27) ముంబై ప్రొఫెషనల్ జట్టుకు నెట్ ప్రాక్టిస్ బౌలర్. గత కొన్నిరోజులుగా ఒత్తిడికి లోనైన కరణ్.. సోమవారం నాడు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. కెరీర్ పట్ల ఆందోళనకు గురై కరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ముంబై మలాద్ ప్రాంతంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కరణ్.. కెరీర్‌లో సరైన అవకాశాలు రావడంలేదని తన స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు పేర్కొన్నారు. ముంబై సీనియర్ జట్టులో చోటు కోసం కరణ్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌ల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడని, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.