13వ అంత‌స్తులో కాంక్రీట్ లో క‌నిపించిన రాక్ పైతాన్..

13వ అంత‌స్తులో కాంక్రీట్ లో క‌నిపించిన రాక్ పైతాన్..

ముంబైలోని ఘాట్‌కోపర్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ లోని 13వ అంతస్తులో టెర్రస్‌పై ఉన్న కాంక్రీట్ లో నాలుగు అడుగుల పొడవైన ఇండియన్ రాక్ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఈ దృశ్యం స్థానిక నివాసితులను అబ్బురపరిచింది. అసలు ఆ పాము అంత ఎత్తుకు ఎలా చేరుకుందో అని అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆసక్తికరమైన సంఘటనను వీక్షించేందుకు జంతు ప్రేమికులు, నివాసితులు తరలి వచ్చారు. ఈ వార్త ముంబైలోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్న జంతు కార్యకర్త సూరరాజ్ సాహా ఈ ఘటనపై స్పందించారు. ఘాట్‌కోపర్ (పశ్చిమ)లోని ఎల్‌బిఎస్ రోడ్‌లోని వ్రాజ్ ప్యారడైజ్ భవనానికి చేరుకుని టెర్రస్‌పై ఉన్న కొండచిలువను చూశారు. టెర్రస్‌పై జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా కొండచిలువ పూర్తిగా తడి సిమెంటుతో ఉన్న కాంక్రీట్ లో ఉన్న సమాచారాన్ని వెంటనే రాష్ట్ర అటవీ శాఖకు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన ముంబై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాకేష్ భోయిర్ బృందం.. పరిస్థితిని అంచనా వేయడానికి,  కొండచిలువను సురక్షితంగా వెలికితీసేలా చూసేందుకు స్థలానికి చేరుకుంది. అదృష్టవశాత్తూ అప్పటివరకు ఆ కొండచిలువకు స్థానికులు ఎలాంటి హానీ కలిగించలేదు. సాహా ఈ బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రశంసించారు. పాములకు హాని చేయడం లేదా చంపడం చట్టవిరుద్ధమని నొక్కిచెప్పారు. పర్యావరణ సమతుల్యత కోసం ఈ జీవులను సంరక్షించాలని కోరారు. అనంతరం జాగ్రత్తగా, సున్నితమైన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, కొండచిలువను సురక్షితంగా అటవీ శాఖ అదుపులోకి తీసుకున్నారు.