
ముంబై : ఫోర్లు, సిక్సర్ల మోత మోగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ హవా నడుస్తోంది. తొలి పోరులోనే 200 ప్లస్ స్కోరుతో లీగ్‌కు ఖతర్నాక్ ఓపెనింగ్ ఇచ్చిన ముంబై అదే జోరుతో వరుసగా రెండో విక్టరీ ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ (38 బాల్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 77 నాటౌట్, 3/28) ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో చెలరేగడంతో సోమవారం బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ఆర్‌సీబీ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 18.4 ఓవర్లలో 155 స్కోరుకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) కెప్టెన్ స్మృతి మంధాన (17 బాల్స్‌లో 5 ఫోర్లతో 23), శ్రేయాంక పాటిల్ (15 బాల్స్‌లో 4 ఫోర్లతో 23) రాణించారు. ముంబై బౌలర్లలో మాథ్యూస్‌కి తోడు సైకా ఇషాక్ (2/26), అమేలియా కెర్ (2/30) సత్తా చాటారు. అనంతరం హీలీ, సివర్ బ్రంట్ (29 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 55 నాటౌట్) రెండో వికెట్‌కు 114 రన్స్ జోడించడంతో ముంబై 14.2 ఓవర్లలోనే 159/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆర్‌సీబీ తడబాటు
బ్యాటర్లు మంచి స్ట్రయిక్ రేట్ చూపెట్టినా.. వరుసగా వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ నార్మల్ స్కోరుకే పరిమితమైంది. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ డివైన్‌తో (16) ఫస్ట్ వికెట్‌కు 4.1 ఓవర్లలోనే 39 రన్స్ జోడించింది. కానీ, ముంబై బౌలింగ్ ధాటికి 8 బాల్స్ తేడాలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఆర్‌సీబీ 43/4తో డీలా పడింది. గుజరాత్‌పై మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్న సైకా ఇషాక్.. డివైన్‌ను ఔట్ చేసి ముంబైకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. రెండు బాల్స్ తర్వాత డెబ్యూ ప్లేయర్ దీక్ష (0)ను క్లీన్‌బౌల్డ్ చేసింది. తర్వాతి ఓవర్లో హేలీ మాథ్యూస్ మరో డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. వాంగ్ క్యాచ్‌తో మంధానను పెవిలియన్ చేర్చిన ఆమె.. టర్నింగ్ బాల్‌తో హీదర్నైట్ (0)ను గోల్డెన్ డకౌట్ చేయడంతో ఆర్‌సీబీ కష్టాల్లో పడ్డది. కాసేపటికే పెర్రీ (13) రనౌట్ అవ్వడంతో 71 రన్స్‌కేసగం వికెట్లు కోల్పోయింది. అయితే, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు.రిచాఘోష్తో కలిసి 20 ఏండ్ల ఆల్‌రౌండర్ కనికా అహుజా (13 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కెర్ వేసిన 11వ ఓవర్లో 4, 6తో జోష్ నింపింది. ఆపై కలితా బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టడంతో 12 ఓవర్లకే ఆర్‌సీబీ స్కోరు వంద దాటింది.కానీ,వస్త్రాకర్ వేసిన13వ ఓవర్లో అనవసర స్వీప్ షాట్ ఆడిన కనిక కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆరో వికెట్‌కు 34 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక, 14వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన హేలీ.. క్రీజులో కుదురుకున్న రిచాను ఏడో వికెట్‌గా వెనక్కుపంపింది. చివర్లో ఆల్‌రౌండర్లు శ్రేయాంక, మేగన్ షుట్ (20) వేగంగా ఆడి ఆర్‌సీబీ స్కోరు 150 మార్కు దాటించారు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు : 18.4 ఓవర్లలో 155 ఆలౌట్ (రిచా ఘోష్ 28, మంధాన 23, హేలీ మాథ్యూస్ 3/28, సైకా 2/26).
ముంబై : 14.2 ఓవర్లలో 159/1 (హేలీ మాథ్యూస్ 77 నాటౌట్, సివర్ 55 నాటౌట్, ప్రీతి బోస్ 1/34)
అటు హేలీ.. ఇటు సివర్
బాల్‌తో ఆర్సీబీని దెబ్బకొట్టిన హేలీ మాథ్యూస్ బ్యాట్‌తో కూడా చెలరేగడంతో ఛేజింగ్‌లో ముంబై పని సులువైంది. రెండో బాల్‌నే బౌండ్రీకి పంపిన ఆమె తన ఉద్దేశం ఏంటో చెప్పింది. మరోవైపు యస్తికా భాటియా (23) వెంటవెంటనే నాలుగు బౌండ్రీలు కొట్టింది. ప్రీతి బోస్ వేసిన ఐదో ఓవర్లో మాథ్యూస్ 6, 4తో గేర్ మార్చగా.. అదో ఓవర్ లాస్ట్ బాల్‌కు యస్తికా ఎల్బీ అవ్వడంతో తొలి వికెట్‌కు 45 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వికెట్ పడ్డా వెనక్కుతగ్గని హేలీ.. మేగన్ షుట్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు రాబట్టడంతో పవర్‌ప్లేను ముంబై 54/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత అయినా ఆర్‌సీబీ బౌలర్లు రేసులోకి వస్తారని అనుకుంటే.. హేలీకి తోడైన బ్రంట్ వారికి ఆ చాన్స్ ఇవ్వలేదు. శ్రేయాంక వేసిన ఎనిమిదో ఓవర్లో మూడు ఫోర్లతో జోరు చూపెట్టింది. అటు హేలీ కూడా పవర్‌ఫుల్ షాట్లతో చెలరేగి 26 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా సగం ఓవర్లకే ముంబై 95/1తో నిలిచింది. హేలీ, బ్రంట్ పోటాపోటీగా షాట్లు ఆడటంతో ఆర్‌సీబీ బౌలర్లు బిత్తరపోయారు. శ్రేయాంక వేసిన 13వ ఓవర్లో బ్రంట్ 4,6 కొట్టగా, మాథ్యూస్ 4, 4తో 20 రన్స్ రాబట్టి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేశారు. పెర్రీ వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లతో బ్రంట్ ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను ముగించింది.