
- ఎలిమినేటర్‌లో యూపీ వారియర్స్ ఓటమి
- చెలరేగిన సివర్ బ్రంట్
- హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీసిన ఇసీ వాంగ్
- రేపు ఢిల్లీతో ముంబై టైటిల్ ఫైట్
ముంబై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌లో సివర్ బ్రంట్ (38 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 నాటౌట్) దంచికొడితే, పేసర్ ఇసీ వాంగ్ (4/15) తొలి హ్యాట్రిక్ నమోదు చేయడంతో.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌లో ముంబై 72 రన్స్ తేడాతో యూపీ వారియర్స్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 182/4 స్కోరు చేసింది. బ్రంట్‌కు తోడుగా అమెలియా కెర్ (19 బాల్స్‌లో 5 ఫోర్లతో 29), హేలీ మాథ్యూస్ (26) రాణించారు. తర్వాత యూపీ 17.4 ఓవర్లలో 110 రన్స్‌కు కుప్పకూలింది. కిరణ్ నవ్‌గిరె (27 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43) మినహా అందరూ ఫెయిలయ్యారు. సివర్ బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో ముంబై.. ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.
బ్రంట్.. దంచెన్
ఫ్లాట్ వికెట్‌పై యూపీ బౌలర్లను చితక్కొడుతూ ఓపెనర్లు యస్తికా భాటియా (21), హేలీ మాథ్యూస్ ముంబైకి అద్భుతమైన ఆరంభాన్నిచారు. ఎదుర్కొన్న తొలి బాల్‌కు బౌండ్రీతో ఖాతా తెరిచిన యస్తికా రెండో ఓవర్‌లోనూ రెండు ఫోర్లు కొట్టింది. నాలుగో ఓవర్‌లో హేలీ సిక్స్‌తో టచ్‌లోకి రాగా, తర్వాతి ఓవర్‌లో ముంబైకి తొలి దెబ్బ తగిలింది. అంజలి (1/17) బౌలింగ్‌లో భాటియా ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 31 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. ఈ దశలో వచ్చిన బ్రంట్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపెట్టింది. ఫోర్‌తో మొదలైన రన్స్ ప్రవాహాన్ని చివరి బాల్ వరకు కొనసాగించింది. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ మాథ్యూస్ ఆమెకు సపోర్ట్ ఇచ్చింది. అయితే, పదో ఓవర్లో మాథ్యూస్‌ను పార్శవి చోప్రా (1/25) పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 38 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియగా..ముంబై ఫస్ట్ టెన్‌లో 78/2 స్కోరుతో నిలిచింది. ఈ దశలో బ్రంట్‌కు జత కలిసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14) నిరాశపర్చింది. 12వ ఓవర్‌లో బ్రంట్ 4, 6, 4తో 16 రన్స్ రాబట్టగా, 13వ ఓవర్‌లో ఫోర్ కొట్టిన హర్మన్ ఎకిల్‌స్టోన్ (2/39) బౌలింగ్‌లో ఔటైంది. అప్పటికి ముంబై స్కోరు 104/3. ఇక్కడి నుంచి బ్రంట్, కెర్ఓవర్కు ఒకటి, రెండు ఫోర్ల చొప్పున బాదడంతో రన్‌రేట్ పరుగెత్తింది. 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్ కొట్టిన కెర్ లాస్ట్ బాల్‌కు ఔటైంది. దీంతో నాలుగో వికెట్‌కు 60 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. లాస్ట్ ఓవర్‌లో పూజా (11 నాటౌట్) ఓ సిక్స్, ఫోర్, బ్రంట్ మరో సిక్స్‌తో 18 రన్స్ రాబట్టి భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.
హడలెత్తించిన వాంగ్
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో యూపీ బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు. పేసర్ ఇసీ వాంగ్ హ్యాట్రిక్‌తో దెబ్బకొడితే, సివర్ బ్రంట్ (1/21), సైకా ఇషాక్ (2/24) అండగా నిలిచారు. దీంతో సెకండ్ ఓవర్‌లో శ్వేత (1) ఔట్‌తో మొదలైన వికెట్లపతనం వేగంగా సాగింది. థర్డ్ ఓవర్‌లో అలీసా హీలీ (11), ఐదో ఓవర్‌లో తహ్లియా మెక్‌గ్రాత్ (7) వెనుదిరగడంతో యూపీ 31/3 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. మధ్యలో ఒంటరిగా పోరాడిన కిరణ్‌కు తోడుగా గ్రేస్ హారిస్ (14) కాసేపు నిలబడింది. దీంతో పవర్‌ప్లేలో యూపీ 46/3 స్కోరు చేసింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న దశలో 8వ ఓవర్లో గ్రేస్‌ని బ్రంట్ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 35 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఫలితంగా ఫస్ట్ టెన్‌లో యూపీ 63/4తో కష్టాల్లో పడింది. 12వ ఓవర్‌లో కిరణ్ 6, 6, దీప్తి (16) ఫోర్ బాదడంతో 19 రన్స్ వచ్చాయి. అయితే 13వ ఓవర్‌లో వాంగ్ హ్యాట్రిక్‌తో ట్రిపుల్ ఝలక్ ఇచ్చింది. 2,3,4వ బాల్స్‌కు వరుసగా కిరణ్, సిమ్రాన్ (0), ఎకిల్‌స్టోన్ (0)ను ఔట్ చేసి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది. 14వ ఓవర్‌లో దీప్తి రెండు ఫోర్లు కొట్టి ఔట్‌కావడంతో స్కోరు బోర్డు 15 ఓవర్లలో 96/8గా మారింది. లాస్ట్ 30 బాల్స్‌లో 87 రన్స్ అవసరమైన దశలో అంజలి (5), రాజేశ్వరి (5), పార్శవి (0 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో యూపీకి ఓటమి తప్పలేదు.