
మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. గుజరాత్ జెయింట్స్ పై 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్..ముంబై బౌలర్ల ధాటికి కేవలం 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 47 పరుగులు సాధించింది. అమేలియా కెర్ 45 పరుగులతో నాటౌట్గా నిలిచింది. నాట్ షివర్ 18 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు సాధించింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2, ఆష్లే గార్డనర్ 1, తనూజా కన్వర్ 1, జార్జియా వెర్హామ్ 1 వికెట్ తీశారు.
అదరగొట్టిన హర్మన్ ప్రీత్..
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బౌండరీలతో దుమ్మురేపింది. కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు చేసింది. ఇందులో 14 ఫోర్లు ఉండటం విశేషం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఎడా పెడా బౌండరీలు బాదిన హర్మన్ ప్రీత్.. 22 బంతుల్లో 11 ఫోర్లతో 51 పరుగులు చేసింది. లీగ్‌లో తొలి అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించింది.
టప టపా..
ఆ తర్వాత 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్...ఆరంభం నుంచే తడబడింది. ఆ జట్టు 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జార్జియా వేర్‌హామ్, దయాళన్ హేమలత కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 8 పరుగులు చేసిన జార్జియా 22 పరుగుల వద్ద వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన స్నేహ్ రాణా, తనుజా కన్వర్ వెంటవెంటనే ఔటయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..దయాళన్ హేమలత ఒంటరి పోరాటం చేసింది. కానీ ఆమెకు సహకరించే వారే కరువయ్యారు. దీంతో గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది.
ముంబై బౌలర్లలో సైకా ఇష్కా 4 వికెట్లు పడగొట్టగా.., నేట్ స్క్రైవర్ , అమేలియా కెర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇస్సీ వాంగ్ ఒక వికెట్ పడగొట్టింది.