
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబైలో జనజీవనం అతలాకుతలం అవుతోంది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికిపైగా చనిపోయారు. మధ్యలో రెండు రోజులు తెరిపినిచ్చిన వానలు సోమవారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. దీంతో జనజీవనం మరోమారు స్తంభించింది. మంగళవారం ముంబై, దక్షిణ కొంకణ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాయగడ్, థానే, పల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో ఇవాళ్టి (మంగళవారం) నుంచి శుక్రవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.