అమృతా ఫడ్నవీస్ స్కెచ్ మామూలుగా లేదుగా.. క్రికెట్ బుకీని ఎలా పట్టించారంటే..?

అమృతా ఫడ్నవీస్ స్కెచ్ మామూలుగా లేదుగా.. క్రికెట్ బుకీని ఎలా పట్టించారంటే..?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌ ను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ముంబయి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో పేర్కొన్న కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్రికెట్‌ బుకీ అనిల్‌ జైసింఘానీని అమృతా ఫడ్నవీస్‌ సాయంతోనే పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఇందులో అమృత అతడితో నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని, ఓసారి ఆయన కుమార్తె అనిక్షను కూడా కలిశారని పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ చాటింగ్‌ స్క్రీన్‌షాట్లను కూడా పోలీసులు కోర్టుకు అందించారు. 

అమృతా ఫడ్నవీస్‌ ను బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, ఆయన కుమార్తె అనిక్షపై ముంబయి పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే..  అప్పటికే 15 కేసుల్లో జైసింఘానీ నిందితుడిగా ఉన్నాడు. 7, -8 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో జైసింఘానీని అరెస్టు చేశారు. అనిల్ జైసింఘానీ లొకేషన్‌ను గుర్తించేందుకు ముంబయి పోలీసులు అమృతా ఫడ్నవీస్‌ సాయం తీసుకున్నారట. ఆ వివరాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. 

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నాలుగు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 24న అమృతా ఫడ్నవీస్.. అనిల్‌ జైసింఘానీకి ఓ మెసేజ్ పంపించారు. ‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి నేను దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడుతాను. ఆయన మీకు న్యాయం చేస్తారు. కానీ.. అక్రమంగా డబ్బు సంపాదించొచ్చన్న అనిక్ష డిమాండ్లను నేను అంగీకరించను. మీరు ముందు నుంచీ నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడు మీరు నా వీడియోలను బయటపెట్టి నన్ను ఇరికించొచ్చు. కానీ.. నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీరు నిజంగా న్యాయం కోరుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ తో నేను మాట్లాడుతాను’’ అని అమృతా ఫడ్నవీస్.. అనిల్ జైషింఘానీకి మెసేజ్‌ చేశారు. దీంతో అనిల్‌ ఆమెకు కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్‌లు పంపించారు.

పోలీసుల సూచనల మేరకు.. అనిల్‌ జైసింఘానీతో అమృతా ఫడ్నవీస్ ఫోన్ లో మాట్లాడారు. ‘‘దేవేంద్ర ఫడ్నవీస్ తో నాకు 2019 నుంచి మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఆయన నాకు విడాకులిస్తారేమో. కానీ.. ఆయన గురించి నాకు తెలుసు. మీరు బాధితులని తెలిస్తే.. 100శాతం న్యాయం జరిగేలా చూస్తారు’’ అని అమృత చెప్పారు. ఆ తర్వాత మరోసారి అనిల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఫోన్ లో కాకుండా అనిక్షను డైరెక్టుగా కలుస్తాను’’ అని చెప్పారు.

అలా అనిక్ష, ఆమె తండ్రి అనిల్ జైసింఘానీ లొకేషన్‌ను ముంబయి పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే మార్చి 16వ తేదీన అనిక్షను అరెస్టు చేశారు. ఆ తర్వాత మార్చి 19న అనిల్‌ జైసింఘానీని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కేసు సంగతేంటి..? 

మహారాష్ర్ట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తో అనిక్ష పరిచయం చేసుకుంది. తానొక డిజైనర్‌ అంటూ మాటలు కలిపి.. తరచూ అమృత ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలోనే ఓ సారి తన తండ్రి గురించి అమృతకు చెప్పింది. బుకీస్‌ గురించి తన తండ్రి పోలీసులకు సమాచారం ఇస్తాడని, దాంతో ఎలా డబ్బు సంపాదించవచ్చో చెప్పింది. దీంతో అమృతా ఫడ్నవీస్ ఆమెను దూరం పెట్టింది. ఆ తర్వాత నుంచి అనిక్ష.. అమృతను బెదిరించడం మొదలుపెట్టింది. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని.. లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లు నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్‌ నంబర్ల ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీంతో అమృతా ఫడ్నవీస్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అమృతా ఫడ్నవీస్ ద్వారానే అనిల్ జైసింఘానీ, ఆయన కూతురు అనిక్షను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.