ఢిల్లీ నిర్భయ తరహాలో మరో ఘోరం: ఐరన్‌ రాడ్‌తో హింసించి..

V6 Velugu Posted on Sep 11, 2021

ముంబైలో దారుణం జరిగింది. ఢిల్లీ నిర్భయ ఘటన తరహా ఘోరం చోటు చేసుకుంది. 30 ఏండ్లు పైబడిన మహిళపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి, అత్యంత క్రూరంగా ఐరన్‌ రాడ్‌తో హింసపెట్టి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ప్రాణం పోయే బాధతో విలపిస్తున్న ఆమెను ఒక టెంపోలో పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున ముంబై సిటీలో జరగింది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా...

శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముంబైలోని సాకీనక ఏరియాలో ఖైరాణి రోడ్డులో సుమారు 30 ఏండ్ల వయసు ఉన్న ఓ మహిళపై ఓ దుర్మార్గుడు అకృత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఐరన్‌ రాడ్డును ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో పెట్టి హింసించి, రోడ్డు పక్కన ఉన్న ఒక టెంపోలో పడేసి పారిపోయాడు. కొంత సమయానికి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ మహిళ చుట్టూ రక్తంతో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఓ మహిళను ఎవరో తీవ్రంగా కొట్టి పడేశారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్‌ చేశాడు. అక్కడికి చేరుకున్న ముంబై పోలీసులు.. ఆమెను చూసి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, కొన ఊపిరితో ఆమె కొట్టుకుంటోందని గమనించి అంబులెన్స్ రావడానికి ఆలస్యమయ్యే చాన్స్ ఉందని వెంటనే తమ వెహికల్‌లో రాజావాడి హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ (శనివారం) ప్రాణాలు విడిచింది.

ఈ అత్యాచారం ఘటనపై పోలీసులు ప్రత్యేక టీమ్స్‌గా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడం ద్వారా అది హత్యాయత్నం కాదని, రేప్‌ అని నిర్ధారించుకున్నారు. ఆ కిరాతకుడు రేప్‌ చేసి ఐరన్‌ రాడ్‌తో తీవ్రంగా హింసించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. 45 ఏండ్ల మోహన్ చౌహాన్ ఓ నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుని రంగంలోకి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును, ఇప్పటి వరకు తీసుకున్న చర్యల వివరాలను తమకు అందించాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు కోసం అసిస్టెంట్ కమిషనర్ జ్యోత్స్నా రాసం ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్ వెల్లడించారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి, చార్జ్‌ షీట్‌ను నిర్ణీత కాల పరిమితిలోగా వేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం సిగ్గు చేటని ఆయన అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

Tagged CCTV, tempo, iron rod, Mumbai rape

Latest Videos

Subscribe Now

More News