సచిన్‌ని తాకిన రెజ్లర్ల ఉద్యమ సెగ.. టెండూల్కర్ ఇంటి ఎదుట ఫ్లెక్సీలు

సచిన్‌ని తాకిన రెజ్లర్ల ఉద్యమ సెగ.. టెండూల్కర్ ఇంటి ఎదుట ఫ్లెక్సీలు

డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు చేపడుతున్న నిరసన నానాటికీ తీవ్రం అవుతోంది. రెజ్లర్లు గత ఐదు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఈ విషయం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు తమ మెడ‌ల్స్‌ను గంగా న‌దిలో విసిరేసి ఇండియా గేట్ వ‌ద్ద ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డ‌తామ‌ని రెజ్ల‌ర్లు హెచ్చ‌రించారు. అందుకుగాను ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిచ్చారు. తాజాగా ఈ ఉద్యమ సెగ భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ని తాకింది. ఈ విషయంపై సచిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ముంబై ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అతన్ని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు బాంద్రా వెస్ట్ పెర్రీ క్రాస్ రోడ్డులోని సచిన్ ఇంటి ఎదుట బ్యానర్లు పెట్టారు. 

పోస్టర్లలో ఏముందంటే..?

'సచిన్ టెండూల్కర్.. భారతరత్న అందుకున్న గొప్ప వ్యక్తి మీరు. ఓ మాజీ ఎంపీ. క్రికెట్‌లో ఓ దిగ్గజం. అలాంటి మీరు రెజ్లింగ్ కోచ్ లపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏళ్ల తరబడి కోచ్‌లు తమను దుర్భాషలాడుతున్నారని, వేధిస్తున్నారని  మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలపై మీరు ఎందుకు ముభావంగా కూర్చున్నారు?'. 

'దేశ అంతర్గత వ్యవహారాల్లో భాగంగా రైతు ఉద్యమంపై మాట్లాడిన విదేశీ మహిళా క్రీడాకారిణికి మీరు సమాధానం ఇచ్చారు. అదే దేశభక్తి ఈరోజు ఎక్కడికి పోయింది? సీబీఐ-ఆదాయపన్ను శాఖ దాడుల భయంతో ఒత్తిడికి లోనవుతున్నారా? ఇకనైనా మీ స్వరాన్ని వినిపించండి. దయచేసి మాట్లాడండి. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేయండి.." అంటూ బ్యానర్ లో వారు సచిన్ ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కాగా, లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌పై చ‌ర్య‌లు చేప్ట‌టాల‌ని డిమాండ్ చేస్తూ మ‌హిళా రెజ్ల‌ర్లు చేపట్టిన ఆందోళ‌నకు వివిధ వ‌ర్గాల నుంచి మద్ద‌తు ల‌భిస్తోంది.వారికి మ‌ద్ద‌తుగా భార‌త రైతు స‌మాఖ్య జాతీయ అధ్య‌క్షుడు రాకేష్ తికాయ‌త్ గురువారం యూపీలోని అలీఘ‌ఢ్‌లో రైతుల మ‌హాపంచాయ‌త్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.