- ఉమ్మడి మెదక్ జిల్లాలో19 మున్సిపాలిటీలు
- బల్దియా ఆఫీసుల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఎలక్షన్కమిషన్మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో అధికారులు నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆయా మున్సిపల్ఆఫీస్లలో వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ఆఫీసర్, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. వార్డులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులు సమకూర్చి సిద్ధంగా ఉంచారు. ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఆ మున్సిపాలిటీ పట్టణ పరిధిలోనే కౌంటింగ్కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేశారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. మొత్తం 87,615 మంది ఓటర్లు ఉండగా 150 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 150 మంది పీవోలు, 150 మంది ఏపీవో, 150 మంది ఓపీవో, 20 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. మొత్తం 31 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 31 మంది అసిస్టెంట్రిటర్నిగ్ఆఫీసర్లు అవసరమని గుర్తించారు. ఇదివరకే ఆర్వో, ఏఆర్వోల గుర్తింపుతో పాటు వారికి శిక్షణ సైతం పూర్తయింది. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరుగనుండగా ఒక్కో పోలింగ్స్టేషన్కు ఒకటి చొప్పున 150 బ్యాలెట్ బాక్స్ లతో పాటు అదనంగా మరో 30 బ్యాలెట్బాక్స్లు సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కౌంటింక్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ఇదివరకే పూర్తయింది.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు వార్డులకు కలిపి ఒక్కో నామినేషన్ స్వీకరణ కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 36 కౌంటర్లతో పాటు 49 మంది ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలతో పాటు అదనంగా మరో 20 శాతం సిబ్బందిని పోలింగ్ విధుల కోసం నియమించారు. వీరే కాకుండా పోలింగ్ వ్యపహారాలను పరిశీలించడానికి మరో 13 మంది నోడల్ అధికారులను ఎంపికచేశారు. 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో అధికంగా ఓటర్లుండడంతో అక్కడ మాత్రం ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం 200 బ్యాలెట్ బ్యాక్సులు అవసరమనియ గుర్తించి సమకూర్చారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా11 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహిర్, నారాయణఖేడ్, అందోల్-జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. మూడు వార్డులకు కలిపి ఒక నామినేషన్ కౌంటర్ ను ఏర్పాటు చేశారు. 11 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 63 కౌంటర్లు ఏర్పాటు చేయగా 103 మంది రిటర్నింగ్ అధికారులు, 103 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, అదనంగా 22 మంది ట్రైనింగ్ ఆఫ్ ట్యూటర్స్ ను ఏర్పాటు చేశారు. 11 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా 508 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఎన్నికల విధుల్లో పాల్గొనే మున్సిపల్ కమిషనర్లతో పాటు సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేశారు.
మెదక్ జిల్లా మున్సిపాలిటీల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు పోలింగ్
స్టేషన్లు
మెదక్ 32 37,016 64
రామాయంపేట 12 13,106 24
నర్సాపూర్ 15 17,066 30
తూప్రాన్ 16 20,42 32
సిద్దిపేట జిల్లా మున్సిపాలిటీల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు పోలింగ్
స్టేషన్లు
గజ్వేల్ 20 46,740 71
దుబ్బాక 20 21,346 41
హుస్నాబాద్ 20 19.227 40
చేర్యాల 12 13,777 24
