యాదాద్రి జిల్లా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరులోని కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ పంపిణీ చేశారు. చౌటుప్పల్‌లోని ఓ వార్డులో ప్రతి ఇంటికి రూ.లక్ష ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట మున్సిపాలిటీలోని ఓ వార్డులో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా డబ్బులు పంచారు. మొదట ఓ అభ్యర్థి రూ.3 వేలు, మరో అభ్యర్థి రూ.2 వేల చొప్పున పంపిణీ చేయగా ఇతర పార్టీ అభ్యర్థి రూ.5 వేలు ఇచ్చారు. దీంతో మొదటి అభ్యర్థి ఒకేసారి రూ.10 వేల చొప్పున పంచగా, పోటీ అభ్యర్థి సైతం రూ.10 వేలు పంపిణీ చేశాడు. బుధవారం ఉదయం మరో పార్టీ అభ్యర్థి రూ.13 వేలు పంచడంతోపాటు అందరూ అవాక్కయ్యారు.
ఖమ్మం జిల్లాలోని ఎదులాపురంలో ఓ వార్డులో ఓటుకు ఓ పార్టీ అభ్యర్థి రూ.5 వేల చొప్పున ఇవ్వగా.. మరొకరు రూ. 7 వేల చొప్పున పంపిణీ చేశారు. కల్లూరు మున్సిపాలిటీలో వార్డులో ఓటుకు రూ.11 వేలు చొప్పున ఇచ్చారు. 1100 మంది ఓటర్లు ఉన్న ఆ వార్డులో డబ్బులు పంచడానికి రూ.కోటి ఖర్చు చేశారు. ఐదుగురు ఓటర్లు ఉన్న ఇంట్లో రెండు పార్టీల అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు కనీసం రూ.లక్షకు చేరింది. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఇండ్లను ప్రత్యేకంగా గుర్తించి మరో రూ. 20 వేలు అదనంగా ఇచ్చారు.
- కరీంనగర్ కార్పొరేషన్ తీగలగుట్టపల్లి పరిధిలో ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు ఓటుకు రూ.7 వేలు నుంచి రూ.10 వేలు పంపిణీ చేశారు.
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని 18వ వార్డులో ఒక్క ఓటుకు రూ.6 వేలు, ఆమనగల్ మున్సిపాలిటీ ఐదో వార్డులో ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇచ్చారు. ఆమనగల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ లీడర్లు పట్టుచీరలు, వెండి కుంకుమ భరిణలు, ఉంగరాలు, లక్ష్మీదేవి నాణేలు పంపిణీ చేశారు.
- సిరిసిల్లలోని కొన్ని వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.10 వేల నుంచి 15 వేలు పంపిణీ చేశారు.
- వనపర్తి జిల్లాలో పెబ్బేరు మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.10 వేలు, కాస్ట్లీ లిక్కర్ బాటిల్ పంచాడు.
- మెదక్ పట్టణంలోని ఓ వార్డులో ప్రధాన పార్టీ అభ్యర్థి 150 మంది ఓటర్లకు ఓటుకు రూ.5 వేల చొప్పున ఇచ్చారు.
- కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ పార్టీలు పోటాపోటీగా రూ. 6 వేల వరకు పంపిణీ చేశారు.
- గద్వాల మున్సిపాలిటీలో డబ్బు ప్రభావం ఎక్కువ కనిపించింది. తమకు అనుకూలమైన వారిని గెలిపించుకునేందుకు సీడ్ మాఫియా రంగంలోకి దిగింది. ప్రతి వార్డులో ఒక్కో ఓటుకు రూ.5 వేల చొప్పున పంచింది.
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఓ వార్డులో ఓటుకు రూ. 6 వేలు, పట్టుచీర, వెండి కుంకుమ భరణి, మగవాళ్లకు టవల్ పంపిణీ చేశారు.
- మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ లాల్గాడీ మలక్‌పేటలోని ఐదో వార్డులో ఓ క్యాండిడేట్ ఓటర్లకు వెండి కాయిన్స్ పంపిణీ చేశారు.
