
ఖానాపూర్, వెలుగు: పట్టణంలోని 12 వ వార్డులో వారం రోజులుగా మంచినీటిని సరఫరా చేయడం లేదని సోమవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట కాలనీ వాసులు, కౌన్సిలర్ షబ్బీర్ పాషా ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. కౌన్సిలర్ షబ్బీర్ పాషా మాట్లాడుతూ...
తమ వార్డులోని 100 కుటుంబాలకు అశోక్ నగర్ కాలనీలోని మంచినీటి బావి నుంచి నీరు సరఫరా చేసే మోటార్ కాలిపోయి రోజులు గడుస్తున్నా మున్సిపల్ కమిషనర్ రిపేర్ చేయించడం లేదని ఆరోపించారు. దీంతో తాగునీరు రాక ప్రజలు అల్లాడుతున్నారన్నారు. తమ వార్డుకు మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదన్నారు. వెంటనే మోటార్ను రిపేర్ చేయించి కాలనీకి తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులు భూమక్క, రాజవ్వ, సాదిక్, అజీమ్, గౌరీ, పద్మతో పాటు తదితరులు ఉన్నారు.