- ఏ వార్డు ఎవరికి వస్తుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏ వార్డు ఎవరికి అనేది తేలాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 మున్సిపాలిటీల పరిధిలో 446 వార్డులున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం సామాజిక వర్గాల వారీగా వార్డుల కేటాయింపు పూర్తయింది. డెబికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు వార్డులను కేటాయించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలకు 151 వార్డు స్థానాలు, ఎస్సీలకు 61, ఎస్టీలకు 20 వార్డులు కేటాయించగా, 225 వార్డులు అన్ రిజర్వ్డ్ అయ్యాయి. మొత్తంలో 229 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఇందులో బీసీలకు 72, ఎస్సీలకు 27 రిజర్వ్‌కాగా, 130 వార్డు స్థానాలు ఆన్ రిజర్వ్డ్ అయ్యాయి. మున్సిపాలిటీ వారీగా ఏఏ వార్డు ఎవరికి రిజర్వ్అవుతుందనే దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్‌లో మొత్తం 75 వార్డులు ఉన్నాయి. వాటిలో ఎస్సీలకు10, ఎస్టీలకు 4, బీసీలకు 23 కేటాయించగా అన్ రిజర్వ్డ్ 38 ఉన్నాయి. ఎస్సీల్లో 5, బీసీల్లో 10, అన్ రిజర్వ్డ్ లో 16 మహిళలకు కేటాయించారు.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో ఐదు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట మినహా మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీ పాలక వర్గం గడువు వచ్చే మే వరకు ఉండడంతో ముందస్తుగా వార్డుల రిజర్వేషన్ ఖరారు చేసినా ఎన్నికలను మాత్రం నిర్వహించడం లేదు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 115 వార్డులుండగా ఎస్టీలకు 5, ఎస్సీలకు 14, బీసీలకు 38, మహిళలకు 34, అన్ రిజర్వ్డ్ 24 సీట్లను కేటాయించారు. మొత్తం వార్డుల్లో 57 వార్డులు మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన వార్డుల్లో 6, బీసీలకు కేటాయించిన వార్డుల్లో 17, అన్ రిజర్వ్ డ్ వార్డుల్లో 24 మహిళలకు కేటాయించారు
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందోల్-జోగిపేట, నారాయణఖేడ్, కోహిర్, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో మొత్తం 263 వార్డులు ఉండగా ఎస్టీలకు 11, ఎస్సీలకు 37, బీసీలకు 79, అన్ రిజర్వ్డ్129 స్థానాలు కేటాయించారు. ఇందులో ఎస్సీ మహిళలకు 16, బీసీ మహిళలకు 45, అన్‌రిజర్వ్ డ్లో 74 వార్డులు మహిళలకు కేటాయించారు.
