కాందిశీకుల భూములపై విచారణ చేస్తం : రాజగోపాల్ రెడ్డి

కాందిశీకుల భూములపై విచారణ చేస్తం : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ వెలుగు:  కాందిశీకుల భూమిపై విచారణ జరిపిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మునుగోడుకు రాగా.. నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మునుగోడు లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచే చేయూత పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రోడ్లను బాగు చేసుకుందామని,  నియోజకవర్గంలో ఇక నుంచి బెల్ట్ షాపులు ఉండవని తేల్చిచెప్పారు. బ్రాహ్మణ వెల్లంల, చర్లగూడెం, కిష్టరాయపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తానన్నారు.  

చౌటుప్పల్ వరకు మెట్రో రైల్ విస్తరణకు కృషి చేస్తానని,  చౌటుప్పల్ మండలంలో పొల్యుషన్‌‌ వెదజల్లుతున్న కెమికల్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు.  చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని కాందిశీకుల భూములను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కబ్జా చేశారని ఆరోపించారు. వీరిపై తప్పకుండా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.

రోడ్ల విషయంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌‌‌‌తో కుమ్మక్కై నాసిరకం పనులు చేయించారని, వాటిపైనా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పున్న కైలాస్ నేత, చౌటుప్పల్ మున్సిపల్‌‌ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి,  జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి,  నాయకులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, జాల వెంకన్న యాదవ్, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, బీసం విజయ్ కుమార్ యాదవ్, నక్క వెంకన్న యాదవ్, నేతలు పాల్గొన్నారు