భయం లేనోడివైతే ఈడీని ఎందుకు కలవరిస్తున్నవ్

భయం లేనోడివైతే ఈడీని ఎందుకు కలవరిస్తున్నవ్

దిమాక్ ఉన్నోళ్లెవరూ సీఎం కేసీఆర్ ను సపోర్ట్ చేయరని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ‘కేసీఆర్.. ప్రధాని మోడీ నీకు శత్రువు కావచ్చు.. కానీ దేశ ప్రజలందరికీ ఆయన నమ్మదగిన మిత్రుడు’ అని ఆమె వ్యాఖ్యానించారు. మునుగోడులో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న విజయశాంతి.. ఇందుకుగానూ ఆయనకు అభినందనలు తెలిపారు. దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేయకుండా.. తెలంగాణ అమరవీరుల కలలను తుంగలో తొక్కిన కేసీఆర్ ను ప్రజలు సమర్ధించాల్సిన అసవరం ఏముందని ప్రశ్నించారు. 

‘‘ రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వనందుకు .. కేసీఆర్ ను  సమర్ధించాలా ? కాళేశ్వరం ప్రాజెక్టును స్క్రాప్ గా మిగిల్చి.. వేల కోట్ల డబ్బులన్నీ జేబులో వేసుకున్నందుకు  కేసీఆర్ ను సమర్ధించాలా ?  గురుకుల పాఠశాలల్లో చదివే  పేద  విద్యార్థులకు నాణ్యత లేని అన్నం పెడుతున్నందుకు కేసీఆర్ ను సమర్ధించాలా ? ’’ అని విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు.  ‘‘ భయంలేని వాడివే అయితే  పదేపదే సీబీఐ, ఈడీని ఎందుకు కలవరిస్తున్నావు కేసీఆర్.. తప్పు చేసిన వాళ్లే భయపడతారు.. తప్పు చేశాడు కాబట్టే కేసీఆర్ భయపడుతున్నాడు’’ అని కామెంట్ చేశారు. 

‘ప్రతి ఎన్నిక సమయంలో కేసీఆర్ బీబీసీని తీసుకొస్తాడు.. బ్రాండీ, బిర్యానీ, కరెన్సీని ఎరగా వేసి గెల్చి వెళ్లిపోతాడు.. ఈసారి వాటికి లొంగొద్దు.. కేసీఆర్ కు బుద్ధి చెప్పండి’’ అని ఓటర్లను విజయశాంతి కోరారు.  ‘‘కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది. బీజేపీని ముక్కలుముక్కలు చేద్దామని అతడు అనుకుంటున్నాడు.. బీజేపీని ఎవరూ ముక్కలు చేయలేరు. కేసీఆర్ ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యం’’ అని స్పష్టంచేశారు.