మూడు పార్టీల మునుగోడు ఆపరేషన్

మూడు పార్టీల మునుగోడు ఆపరేషన్

మునుగోడులో ఒక పార్టీ దుర్యోధనుడిలా, మరో పార్టీ శల్యుడిలా, ఇంకో పార్టీ ధర్మరాజులా వ్యవహరించాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకే రాజనీతి. కాలంలో మాత్రమే తేడా! కాంగ్రెస్ పార్టీ అసలు టైమ్ లో ‘రాహుల్ యాత్ర’ పెట్టుకొని పోటీ ఇవ్వాల్సిన పరిస్థితిలో గాలికి వదిలేసి, కాడి కింద పడేసి నిజంగా ‘ఆడపిల్ల’ను ఒంటరిని చేసింది. మక్తల్ లో ఎంటరైన రాహుల్ యాత్రను మధ్యలో ఆపేశారు. అలాగే ఇంకోవారం ఆపేస్తే కొంపలు ఏం మునిగేవి కావు. ఎన్నికల్లో పనిచేయకుండా ఉండేందుకు అది ఒక సాకుగా కాంగ్రెస్ లీడర్లకు మారింది. నిఖార్సయిన తెలంగాణ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురును అంత ఘోరంగా పరాజయం పాలు చేయడం కాంగ్రెస్ నేతలకే సాధ్యమైంది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఒక నెపం మాత్రమే. ‘తన్ను మాలిన ధర్మం’ ఉంటుందని ఎవరూ అనుకోరు. రేవంత్ రెడ్డి ఎంత హైజంప్ చేసినా ‘కాంగ్రెస్ కలహాలు’ వచ్చే సాధారణ ఎన్నికల వరకు కూడా ఇలాగే ఉంటాయి. ఈ రహస్యం కనిపెట్టిన కేసీఆర్ ఇపుడు కాంగ్రెస్ గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. కాంగ్రెస్ ను ఎలా దారికి తేవాలో ఆయనకు బాగా తెలుసు. అవసరమైతే పెద్దలు జానారెడ్లో, ఉత్తమకుమార్ రెడ్లో ఎలాగూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒంటికాలిపై దేకుతున్న కాంగ్రెస్ కు నేను ఊతం ఇస్తానని కేసీఆర్ నమ్మబలికితే కాంగ్రెస్ అధిష్టానం కళ్లు మూసుకొని కేసీఆర్ ను కౌగిలించుకొంటుంది. 2014లో అలా నమ్మే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది. రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామం ఇదే.

రాజ్​గోపాల్​రెడ్డి అభిమన్యుడయ్యాడు

మునుగోడు ఎన్నికలో సరాసరీ తలపడ్డది టీఆర్​ఎస్, బీజేపీలే. ఈ ఎన్నిక వస్తుందని రెండు పార్టీలకు తెలిసినా టీఆర్ఎస్ వ్యవహరించినంత జాగరూకతతో బీజేపీ వ్యవహరించలేదు. 'రాజాసింగ్' మతతత్వం అంటూ వేసిన బురద కడుక్కునే లోపు సంజయ్ పాదరక్షలు మోసాడని ఇంకోసారి బురద చల్లారు. ఈ రెండింటినీ తిప్పికొట్టేలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఈలోపు కేసీఆర్, కేటీఆర్ పక్కా వ్యూహంతో గ్రామానికో ఎమ్మెల్యేను ఎంగేజ్ చేసారు. హోం గార్డు నుంచి డీజీపీ వరకు అందర్నీ వాడుకొన్నారని ప్రతిపక్షాలు అంటూనే ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత డబ్బు పెట్టి స్థానిక నాయకులను మచ్చిక చేసుకున్నారు. బీజేపీలో పాత కొత్త నాయకులకు సమన్వయం లేకపోవడం పై నుంచి  కింది వరకు కనిపించింది. ఈ పరిస్థితిని టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలచుకున్నది. బీజేపీ ఈ ‘మైక్రో మేనేజ్​మెంట్’ అంతా ఒక్క రాజ్​గోపాల్​రెడ్డికే అప్పజెప్పింది. రెండు దశాబ్దాల నుంచి రాజకీయాలు ఎలా చేయాలో తెలిసినా.. రాజ్​గోపాల్​రెడ్డి ఒక్కడే ఓ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడటం సాధ్యం కాదు కదా..! రాష్ట్రస్థాయి నాయకులంతా అక్కడ మోహరించినా పోల్​మేనేజ్​మెంట్​ను రాజగోపాల్​రెడ్డి, బీజేపీ కార్యకర్తలే చూసుకున్నారు. అనేక మంది స్టార్​ క్యాంపెయినర్లుగా నిలబడ్డా కింది స్థాయి మైక్రో మేనేజ్​మెంట్​లోకి వెళ్లలేదు.   అది టీఆర్ఎస్ నేతల మేనేజ్​మెంట్​ను దెబ్బకొట్టలేకపోయింది. బూత్ లెవల్లో పనిచేసిన బీజేపీ కార్యకర్తల శక్తి టీఆర్ఎస్ నాయకులను, ఎమ్మెల్యేలను ఎదుర్కోలేకపోయింది. గ్రామాల్లోని బీజేపీ నాయకుల ఇళ్లచుట్టూ పోలీసులు గస్తీ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ల కదలికలు టీఆర్ఎస్ కు సులభంగా తెలిశాయి.  తర్వాత రాష్ట్రస్థాయి నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కన్పించింది. సోషల్ మీడియాను, కొత్తగా పుట్టించిన యూట్యూబ్ ఛానళ్ల ప్రచారాన్ని టీఆర్ఎస్ బాగా ఉపయోగించుకుంది. కరుడుగట్టిన పాత బీజేపీ నాయకులను స్థానికంగా టీఆర్ఎస్ క్యాప్చర్ చేసింది. డబ్బు, మద్యం పంచడంలో బీజేపీ సంస్థాగతంగా ఫెయిల్ అయ్యింది. పార్టీ పూర్తిగా రాజగోపాల్ రెడ్డి టీం మీద ఆధారపడింది. రాజగోపాల్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్నా ఇలా మొత్తం ప్రభుత్వం మోహరించినప్పుడు అభిమన్యుడయ్యాడు.

తబ్బిబ్బవుతున్న వామపక్షాలు

మా ఓట్లతోనే గెలిచారన్న ఆనందంతో వామపక్షాలు ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన 'గురుతర బాధ్యత' వాళ్లపై ఉంది. కాబట్టి కేసీఆర్‌‌ను కాంగ్రెసుతో జతకట్టించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలకు ఎన్నికల పొత్తు ఉండాలా! వద్దా! అనే అంశంపై ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. సహజంగా కేసీఆర్ దేశంలోని ప్రాంతీయ పార్టీల నాయకులందరికీ మించిన వ్యూహకర్త అన్నది సత్యం. ఆయన తెలివితేటలను, ఆర్థిక బలాన్ని కాంగ్రెస్ కు వెన్నుగా మార్చే పని వామపక్షాలు మొదలుపెట్టాయి. అంతేగాకుండా మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్  పెద్దగా కాంగ్రెస్ పై విమర్శలు చేయలేదు. కాంగ్రెస్​టీ ఆర్ఎస్​పై పెద్దగా విమర్శలు చేయకుండా గోవర్ధనరెడ్డి.. ఆడపిల్ల.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్రోహం.. సీనియర్ల అలకలు.. వెన్నుపోట్లు.. రేవంత్​రెడ్డి కన్నీళ్లు.. రాజగోపాల్​రెడ్డిపై వ్యతిరేకత.. రాహుల్​ జోడో యాత్రలో చెప్పిన ‘కేసీఆర్​–మోడీ ఒక్కటే’.. ధనప్రవాహం.. కాంట్రాక్టులు వంటి విమర్శలను నమ్ముకుని ముందుకెళ్లింది. ఇవన్నీ టీఆర్ఎస్​కు లాభం చేకూర్చాయి. టిఆర్ఎస్ కు వచ్చిన 10 వేల మెజార్టీకి కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం, వామపక్షాల నికర ఓటు బ్యాంకే కారణం. మరోపక్క మునుగోడు ఫలితం చూసి వామపక్షాలు తమది వ్యూహాత్మకం అనుకొంటున్నారు కానీ కేసీఆర్ వాళ్లను ఎలా వాడుతున్నాడనేది వాళ్లకే తెలీదు. తోకళ్లా ఎవరుంటే వాళ్ళను హతుక్కునే వామపక్షాలు ఎప్పుడో తమ విలువను కోల్పోయాయి.  వాళ్లకు మొత్తం పార్టీ ధ్వంసం అయినా పర్వాలేదు, ఇద్దరు ముగ్గురు ఎర్రచొక్కాలేసుకొని అసెంబ్లీకి వెళ్తే అదే పదివేలు.  ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్లకు తోకలవుతారు. అదో వ్యూహం.  తెలుగు రాష్ట్రాల్లో 'క్రామేడ్'ల చరిత్రను పేజీలు తిప్పితే మనం చదివేయవచ్చు.

‘జోలపాట’ రాజకీయాలు బీజేపీకి అనర్థం

బీజేపీ పార్టీగా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని కేసీఆర్ కల్పించాడు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇందులో కడిగిన ముత్యంలా కన్పించినా, కేసీఆర్, కేటీఆర్ మరోవైపు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. సాధారణ ఎన్నికల వరకు బీజేపీ నాయకత్వం ఈ ‘జోలపాట’ రాజకీయం చేస్తే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మిగలటం కష్టం. మరోవైపు రాజగోపాల్ రెడ్డి  కాంట్రాక్ట్ కు అమ్ముడుపోయాడని స్థానికంగా చర్చించుకొనే విధంగా టీఆర్ఎస్ చేసి అతనికున్న మంచి పేరును న్యూట్రలైజ్ చేసింది.  టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ మైక్రోఅబ్జర్వేషన్ తో నిర్ణయాలు తీసుకుని అప్పటికప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో అమలు చేయించారు. అనేక కులాలను, కుల సంఘాలను, ఎన్నో వర్గాలను ఎన్నో హామీలతో టీఆర్ఎస్ తమవైపు తిప్పుకొంది. ముంపు బాధితులు మొదలుకొని మందు తాగి బ్రతికే తాగుబోతు వరకు ఎవర్నీ వదిలిపెట్టలేదు. కేసీఆర్ చతురంగ బలాలను  మోహరించడంతో  వచ్చిన గెలుపు కూడా టీఆర్ఎస్ కు శల్య పరీక్షగా, శీల పరీక్షగా మారిన మాట వాస్తవం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వేడి మొదలైంది. దీని పర్యవసనాలు మున్ముందు చూస్తాం. భవిష్యత్తులో ఎన్నికలు అభివృద్ధిపై కాకుండా ‘వ్యూహా’ల మీద జరగబోతున్నాయి. అందులో ఎవరిది పైచేయి అయితే వాళ్లే విజేతలు.

ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ పరిస్థితి!

ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగతంగా నిజాయితీగా పనిచేస్తున్నా ఇప్పుడు బీఎస్పీకి దేశవ్యాప్తంగా ఆ గౌరవం పోయింది.  మాయావతి చేసిన తప్పుల వల్ల పార్టీ పరిస్థితి అంతగా బాగాలేదు. సీబీఐ డైరెక్టర్‌‌గా పనిచేసిన లక్ష్మీనారాయణకు యువతలో మంచి క్రేజ్ ఉండేది. ఆయన వెళ్లి పవన్ కళ్యాణ్ ముందు చేతులు కట్టుకొని నిలబడటంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ రోజుకు జయప్రకాశ్ నారాయణకున్న లోతైన అవగాహనకు అతనిపై గౌరవం ఉంది. కానీ సంప్రదాయ పార్టీల వ్యూహాలు, బలాల ముందు ఆయనా తేలిపోయాడు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయత్నంలోనే జీవితం గడిపేయాల్సి వస్తుంది. ఈలోపు ఇంకో నాయకుడిని పుట్టించి ప్రవీణ్ ను రాజకీయంగా మటుమాయం చేస్తారు. మందకృష్ణ మాదిగ వంటివాళ్లు పెద్ద ఉద్యమమే చేసి చైతన్యం తెస్తే, ఇప్పుడాయన ఏమయ్యాడో చూస్తూనే ఉన్నాం.  ప్రవీణ్ కుమార్‌‌ను చదువుకున్న దళిత వర్గాలు విశ్వసిస్తున్న మాట నిజం. కానీ రాజకీయ అంగట్లో అది ఎంతమేర ప్రభావం చూపుతుందో కాలమే చెప్పాలి.

- శ్రీ కౌస్తుభ, 
పొలిటికల్, సోషల్ ​ఎనలిస్ట్