
ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. మానవ సంబంధాలు మరీ ఇంత దిగజారుతున్నాయా అన్న సందేహం వస్తోంది. వివాహేతర సంబంధం కోసం, ఆస్థి కోసం, పెద్దలు చేసిన పెళ్లి ఇష్టం లేక... ఇలా కారణం ఏదైనా కానీ, భర్తలను అంతమొందించేందుకు ఏమాత్రం వెనకాడట్లేదు నేటి భార్యలు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా ఇంచుమించు అలాంటిదే... సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించే ఈ ఘటన ఏపీలోని అనకాపల్లిలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
తనకు న్యాయం చేస్తానని చెప్పి బంగారం, డబ్బు తీసుకొని ఇబ్బందిపెట్టడమే కాకుండా.. తనకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం గురించి కుటుంబసభ్యులకు చెప్పాడని.. సదరు వ్యక్తిని చంపేందుకు స్కెచ్ వేసింది ఓ మహిళ. రూ. లక్ష సుపారీ ఇచ్చి మరీ హత్యకు ప్లాన్ చేస్తే... అసలు వ్యక్తి కాకుండా మరో వ్యక్తిపై హత్యాయత్నం చేశారు కిల్లర్స్. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవ్వడంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది.
విలేకరిని నమ్మి బంగారం, నగదు ఇచ్చింది:
అనకాపల్లి జిల్లా ఎస్ . రాయవరానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరికి పాయకరావుపేట వెంకటగిరి చెందిన వ్యక్తితో ఆరేళ్ళ కిందట వివాహమయ్యింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా మూడేళ్ళ కిందట ఇద్దరు విడిపోయారు. భర్తపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. ఈ క్రమంలో ఓ విలేకరి పోలీసులతో మాట్లాడి న్యాయం చేస్తానని నూకేశ్వరిని నమ్మించాడు. దీంతో ఆమె అతనికి రూ.లక్ష నగదు, 6.5 తులాల బంగారం ఇచ్చింది.
Also Read:-సూర్యాపేటలో సినీ ఫక్కీలో బంగారం దోపిడీ.. గోడకు కన్నం.. 18 కిలోల గోల్డ్ మాయం !
వివాహేతర సంబంధం గుట్టు రట్టు:
కొంతకాలం తర్వాత నూకేశ్వరికి విలేకరికి మధ్య విభేదాలు రావడంతో డబ్బు,బంగారం తిరిగి ఇవ్వాలని కోరింది.. విలేకరి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది నూకేశ్వరి. దీంతో ఆమె మీద కోపంతో నూకేశ్వరికి ఉన్న వివాహేతర సంబంధం గురించి ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడు సదరు విలేకరి. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఇందుకు కారణమైన విలేకరిని హత్య చేయించాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది నూకేశ్వరి.
విలేకరి హత్యకు స్కెచ్.. మరొకరిపై హత్యాయత్నం:
కాకినాడకు చెందిన ముగ్గురు సుపారీ కిల్లర్స్ ని సంప్రదించి విలేకరి హత్యకు స్కెచ్ వేసింది నూకేశ్వరి. ఈ క్రమంలో జులై 11న విలేకరి ఇంటిని కూడా వారికి చూపించింది నూకేశ్వరి. అయితే.. విలేకరిని హత్య చేయాలని వచ్చిన కిల్లర్స్ పొరపాటున పక్కింటి వ్యక్తిపై రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి సెల్ ఫోన్లు, బైకులు, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.