
హనుమకొండ, వెలుగు: వరంగల్‌లో ముగ్గురి హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు వేట కత్తులతో పాటు, చెట్లు కోసే మెషీన్, రెండు ఆటోలు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్‌జోషి కమిషనరేట్ఆఫీస్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల పట్టణానికి చెందిన మహమ్మద్ ఘనీసాబ్కు ముగ్గురు కొడుకులు. వారిలో మొదటి ఇద్దరు మహమ్మద్ చాంద్ పాషా(54), మహమ్మద్ షఫీ దాదాపు 30 ఏండ్ల కిందట పార్ట్నర్ షిప్లో పశువుల బిజినెస్ స్టార్ట్ చేశారు. పరకాల, జంగాలపల్లి, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని కబేళాలకు తరలించేవారు. బిజినెస్‌లో వచ్చే ఆదాయాన్ని ఇద్దరూ సమానంగా పంచుకునేవారు.
వాటా ఇవ్వడం లేదని కక్ష
బిజినెస్ బాగా నడుస్తుండటంతో అన్నదమ్ములిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం కొనసాగించారు. ఈ క్రమంలోనే ఆరు నెలల కిందట రైతులు, ఇతర వ్యాపారుల నుంచి కొన్ని పశువులను కొనుగోలు చేశారు. ఆ తరువాత బిజినెస్ లాస్ రావడంతో షఫీకి దాదాపు రూ.60 లక్షల వరకు అప్పులు మిగిలాయి. ఇదిలా ఉంటే డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి పశువులు ఇచ్చేందుకు రైతులు, వ్యాపారులు నిరాకరించారు. దీంతో ఈ విషయంలో తనకు సంబంధం లేదని, సంబంధిత మొత్తాన్ని తన తమ్ముడే చెల్లిస్తాడని వారిని షఫీ ఇంటికి పంపించాడు. ఈ లావాదేవీలకు సంబంధించి షఫీ పలుసార్లు చాంద్ పాషాను సంప్రదించగా స్పందించలేదు. దీంతో ఇదివరకు బిజినెస్ బాగా నడిచిన సమయంలో అన్న చాంద్‌పాషా ఎక్కువ లాభాలు తీసుకుని తనను మోసం చేశాడని షఫీ భావించాడు. అప్పులను చెల్లించి, తనకు రావాల్సిన వాటా డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా పలుసార్లు వాదనకు దిగాడు. అందుకు చాంద్‌పాషా ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య దాదాపు మూడేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చాంద్‌పాషాపై షఫీ కక్ష పెంచుకున్నాడు. అన్నతో పాటు ఆయన కుటుంబ సభ్యులను చంపేందుకు నిర్ణయించుకున్నాడు.
15 రోజుల కిందటే ప్లాన్
అప్పుల గొడవలతో మనస్తాపానికి గురైన షఫీ ఎలాగైనా అన్న కుటుంబాన్ని చంపాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే తన వద్ద పని చేసే పశువుల కాపరులు నర్సంపేట శాంతినగర్‌కు చెందిన బోయిని వెంకన్న, జయశంకర్ జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లికి చెందిన రాగుల విజేందర్, డ్రైవర్లుగా పని చేసే డాక్టర్స్కాలనీకి చెందిన ఎండీ సాజీద్, ఉర్సు సుభాష్ నగర్‌కు చెందిన ఎండీ మీర్జా అక్బర్, వరంగల్ ఎంహెచ్నగర్కు చెందిన ఎండీ పాషాను సంప్రదించాడు. 15 రోజుల కిందట వారందరితో చర్చించి హత్యకు సహకరించాలని కోరాడు. మర్డర్‌ప్లాన్ వివరించగా వారంతా ఓకే చెప్పారు.
హైదరాబాద్ నుంచి వేట కత్తులు
అన్న చాంద్ పాషా ఇల్లు అణువణువూ తెలిసిన షఫీ మర్డర్ కు పక్కా స్కెచ్ గీశాడు. ఇందుకు పదునైన ఆయుధాలు సమకూర్చుకోవాలని భావించాడు. హత్య చేసేందుకు హైదరాబాద్‌లో వేటకత్తులు కొనుగోలు చేశాడు. చాంద్ పాషా ఇంటికి వెళ్లగానే కరెంట్కట్చేయడం ప్లాన్‌లో ఓ భాగం. వారి ఇంటి తలుపులకు ఉన్న బోల్ట్‌లు కట్ చేసేందుకని బ్యాటరీతో నడిచే చెట్లు కోసే మెషీన్‌ను వరంగల్ నగరంలోనే కొన్నాడు. వాటిని ఎవరికంటా పడకుండా షఫీ తన ఇంట్లోనే దాచాడు.
గాఢ నిద్రలో ఉంటారనే ఆ సమయం
ముందస్తు ప్లాన్ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో షఫీ తన మిత్రులను ఇంటికి పిలిపించుకున్నాడు. వారి ఇంటిపై కూర్చొని హత్య గురించి చర్చించారు. జనసంచారం లేకపోవడంతో పాటు అందరూ నిద్రమత్తులో ఉంటారనే ఉద్దేశంతో అర్ధరాత్రి మర్డర్ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎండీ సాజీద్, ఎండీ పాషాకు సంబంధించిన రెండు ఆటోల్లో వెంకన్న, విజేందర్, మీర్జా అక్బర్బయల్దేరగా.. షఫీ బైక్ పై వారికి రూట్చెబుతూ వెళ్లాడు. చాంద్‌పాషా ఇంటికి చేరుకుని చుట్టుపక్కల వారికి కనిపించకుండా కరెంట్కట్చేశారు. తరువాత డోర్లు కట్ చేసే సౌండ్ ఎవరికీ వినిపించకుండా ఆటో ఎక్సలేటర్ ఫుల్ గా రేజ్ చేశారు. వెంటనే తలుపులు కోసి ఇంట్లోకి చొరపడ్డారు. ఆ శబ్ధానికి నిద్ర లేచిన చాంద్‌పాషా గట్టిగా అరవడంతో ఆయన భార్య సాబీరా బేగం(50), బావ మరిది ఖలీల్ పాషా(40), కుమారులు ఫహాద్ పాషా(24), సమీర్ పాషా(21) నిద్ర నుంచి లేచారు. దీంతో వారి వెంట తెచ్చుకున్న కారాన్ని వారి కండ్లలో చల్లి ఎలక్ట్రిక్ రంపం, వేట కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చాంద్ పాషా, సాబీరా బేగం, ఖలీల్ పాషాకు మెడ, గొంతు ప్రాంతంలో తీవ్ర గాయాలు కాగా.. వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వారి అరుపులు విని పక్క రూంలోనే ఉన్న చాంద్ పాషా కూతురు రుబీనా బేగం పరుగెత్తుకొచ్చి ఎవరినీ చంపొద్దంటూ గట్టిగా అరుస్తూ షఫీని వేడుకొంది. దీంతో చుట్టుపక్కలవారు వస్తారని భావించి ఆమెను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఆధారాలు మాయం చేసే ప్లాన్
హత్యలు చేసిన అనంతరం నిందితులంతా నేరుగా షఫీ ఇంటికి వెళ్లారు. రక్తపు మరకలతో ఉన్న డ్రెస్ అక్కడే మార్చుకున్నారు. షఫీ ఇంట్లోనే దాదాపు 20 నిమిషాలు గడిపారు. ఆ తరువాత ఇంట్లో నుంచి బయటకు రాగా పోలీసులు గాలించి పట్టుకున్నారు. తరువాత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి మూడు వేటకత్తులు, ఎలక్ట్రిక్ రంపం, వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా రెండు కత్తుల కోసం గాలిస్తున్నట్లు సీపీ చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.