ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని ముర్రేడు వాగు బ్రిడ్జిపై అడుగడుగునా గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. ఈ బ్రిడ్జిపై నుంచి ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, చత్తీస్​ఘడ్, ఒడిశా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేలాది వెహికల్స్​ తిరిగే ఈ రోడ్డు పూర్తిగా చెడిపోయినా ఆఫీసర్లు రిపేర్లు చేయించకపోవడంతో తిప్పలు పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కేటీపీఎస్ ఏడవ దశలో కొనసాగుతున్న మరమ్మతులు

వారం తర్వాతే విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ  

పాల్వంచ, వెలుగు: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఏడవ దశలో వార్షి క మరమ్మతులు కొనసాగుతున్నాయి. 45 రోజుల షెడ్యూల్ తో 800 మెగావాట్ల కెపాసిటీ కలిగిన యూనిట్ లో ఉత్పత్తి నిలిపి వేసి మరమ్మతులు చేపట్టిన ఆఫీసర్లు పలు సాంకేతిక  సమస్యలను గుర్తించారు. యూనిట్  రోటర్స్ లో సమస్యలు ఉండడంతో  హరిద్వార్ లోని బీహెచ్ఈఎల్ సామాగ్రి తయారీ కేంద్రం నుంచి  యంత్ర పరికరాలను తీసుకురానున్నా రు. జులై 2న యూని ట్ నుంచి విద్యు త్ ఉత్పత్తి నిలిపి వేసిన ఆఫీసర్లు ఈ నెల 20 నుంచి విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించాలని భావించారు. అయితే మరమ్మతుల్లో జాప్యం జరగడంతో ఉత్పత్తి పునరుద్ధరణకు మరో వారం రోజులు పడుతుందని చీఫ్ ఇంజనీర్ పలుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు.

నారాయణ విద్యాసంస్థపై కేసు పెట్టాలి

ఖమ్మం టౌన్,వెలుగు: రాష్ట్రంలోని శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను రద్దు చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్  డిమాండ్​ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. బాధిత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు లక్ష్మణ్, సతీశ్, శ్రీకాంత్, రాంబాబు,పాషా, శ్రవణ్, మల్సూర్  పాల్గొన్నారు.

నారాయణ విద్యా సంస్థ ఎదుట పేరెంట్స్​ ధర్నా

మధిర, వెలుగు: తమ పిల్లల టీసీలు, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వకుండా రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం నారాయణ విద్యా సంస్థ ఎదుట పేరెంట్స్​ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు మాట్లాడుతూ టీసీ,  ఇతర సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఫీజులన్నీ సకాలంలో చెల్లించినా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు.

పెండింగ్  స్కాలర్​షిప్స్  వెంటనే విడుదల చేయాలి

ఖమ్మం టౌన్,వెలుగు: పెండింగ్ లో  ఉన్న రూ.3,375 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్​ డిమాండ్​ చేశారు. సోమవారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాలకు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​లను విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రమని చెబుతున్న సీఎం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడమ ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలబోయిన కిరణ్, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్రాంతి, మస్తాన్, సహాయ కార్యదర్శి ఉపేందర్, తిరుమల్, సతీశ్, వేణు, బన్నీ, అభిరామ్, వేణు పాల్గొన్నారు.

కొడుకు వేధిస్తున్నాడని వృద్ధుడి ఫిర్యాదు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మానసికంగా, శారీరకంగావేధిస్తున్న తన కొడుకుపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ముదిండి రాజు అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లును వేడుకున్నారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​లో దరఖాస్తు అందజేశారు.  అలాగే బూర్గంపహాడ్​ మండలం నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన జీడిమల్ల సత్యనారాయణ తన ఇల్లు గోదావరి వరద ముంపునకు గురైందని, వరద నష్ట పరిహారంతో పాటు నిత్యావసర వస్తువులు ఇప్పించాలని కోరారు.  లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్​ కార్యాలయంలో ఆఫీస్​ సబార్డ్​నేట్​గా పని చేస్తూ తన భర్త చనిపోయాడని, ఆ ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతూ ఇల్లందు మండలం సుదిమళ్ల గ్రామానికి చెందిన చీమల నాంచారి వినతిపత్రం అందించింది. డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో రమాకాంత్, డీఎంహెచ్​వో దయానందస్వామి, జిల్లా వెల్ఫేర్​ ఆఫీసర్​ వరలక్ష్మి పాల్గొన్నారు.