
పరిశీలించిన బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్
హైదరాబాద్, వెలుగు: ముసారాం బాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనులను స్పీడ్‌గా కంప్లీట్ చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. బల్దియా పరిధిలోని పలు అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ముసారంబాగ్ బ్రిడ్జి పనులను పరిశీలించి ప్రజలకు తర్వగా అందుబాటులోకి తెచ్చేందుకు పనులు చేస్తూ.. అవసరమైన భూసేకరణ కూడా వెంటనే కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అనంతరం బ్రిడ్జి పనుల మ్యాప్‌ను పరిశీలించారు. అంతకు ముందు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎఫ్ సీఐ గోడౌన్ వరకు ఫార్మేషన్ రోడ్డు పనులను రైల్వే, ఫారెస్ట్, ఎస్ఆర్డీపీ ఉన్నతాధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం కమిషనర్ వెంట ఈఎన్ సీ జియావుద్దీన్, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్ రాజు తదితరులు ఉన్నారు.
ఏడాదిలో కంప్లీట్ చేసేలా ప్లాన్..
మూసీ నదిపై ముసారం బాగ్, చాదర్ ఘాట్ వద్ద కొత్త బ్రిడ్జిల నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తయ్యేలా కనిపిస్తుంది. గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులను ప్రారంభించలేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ముసారం బాగ్ బ్రిడ్జి పనులు షురూ చేసి బల్దియా అధికారులు వేగం పెంచారు. రూ.52 కోట్లతో ఆరులేన్లతో నిర్మిస్తున్నారు. దీన్ని 29.5 మీటర్ల పొడవు, 6 లేన్లతో 20 మీటర్ల క్యారేజ్ వే, 3.5 మీటర్ల ఫుట్ పాత్ తో నిర్మించనున్నారు. ముందుగా ఒక పక్క మూడులేన్ల పనులు కొనసాగిస్తున్నారు. మరో పక్క నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ ఏడాది చివరిలోపు బ్రిడ్జి పనులు పూర్తికానున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రూ.42 కోట్లతో చాదర్ ఘాట్ బ్రిడ్జి పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఖరారైన అనంతరం పనులు ప్రారంభిస్తారు. త్వరలోనే మొదలుపెట్టి ఏడాదిలోపు పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేశారు.
వరదలు వచ్చినప్పుడు..
ముసారాం బాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల నిర్మాణం ఎప్పుడో చేపట్టాల్సి ఉంది. 2020లో వరదలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిల నిర్మాణాల ప్రస్తావన తెచ్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తినప్పుడే వీటి గురించి మాట్లాడేది. ఆ తర్వాత నిర్మాణాలను పట్టించుకోలేదు. గతేడాది జులైలో జంటజలాశయాల గేట్లు ఎత్తినప్పుడు వరద ఉధృతి కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ పెట్టారు. అనంతరం రూ.94 కోట్లతో రెండు బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు, పనులను10 రోజుల్లో ప్రారంభిస్తామని అప్పట్లో మంత్రులు చెప్పినా చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో రెండు బ్రిడ్జిలకు టెండర్లు వేయగా ముసారాం బాగ్ బ్రిడ్జి టెండర్ పూర్తయింది. చాదర్ ఘాట్ బ్రిడ్జి నిర్మాణానికి మూడుసార్లు టెండర్లు వేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. టెండర్ పూర్తయిన పనులు కూడా త్వరగా చేయలేకపోయారు. అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు పెండింగ్ పడ్డాయి. రెండు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వస్తే.. వరద నీటి నుంచి స్థానికులకు ఉపశమనం లభిస్తుంది.