మూసీ బ్యూటిఫికేషన్ చకచకా..జంట జలాశయాల ప్రవాహ తీరు పరిశీలన

మూసీ బ్యూటిఫికేషన్ చకచకా..జంట జలాశయాల ప్రవాహ తీరు పరిశీలన
  • మూసీ, ఈసా పొడవునా ఎంఆర్డీసీఎల్​ఎండీ, జాయింట్ఎండీ సందర్శన
  • సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియ షురూ 
  • సుందరీకరణ తర్వాత స్వచ్ఛమైన నీరు పారేలా యాక్షన్​ప్లాన్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనులు చకచక ముందుకు సాగుతున్నాయి. తాజాగా మూసీ పరివాహక సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియను చేపట్టగా, ఇందులో భాగంగా జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు మూసీలో ప్రవాహాలు ఎలా ఉన్నాయన్న దానిపై (హైడ్రాలజీ స్టడీ) అధ్యయనం చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థతో కలిసి అధికారులు పరిశీలించారు. 

ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​లకు వరదలు వచ్చినప్పుడు గేట్లు తెరిచి నీటిని మూసీలోకే వదులుతారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జలాశయాల నిల్వ సామర్థ్యం, వరదల టైంలో నీటి ప్రవాహక తీరును తెలుసుకునేందుకు ఎంఆర్​డీసీఎల్​ ఎండీ నర్సింహారెడ్డి, జాయింట్​ఎండీ గౌతమి, ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​ ఎం.సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు గురువారం మూసీ పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. మూసీ,ఈసా నదుల పొడవునా బాపూఘాట్​వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలను సందర్శించారు. ఎక్కడెక్కడ నది వెడల్పు ఎంత ఉండాలని నిర్ధారించేందుకు గ్రామ నక్షాల (విలేజ్ రెవిన్యూ మ్యాప్‌‌‌‌‌‌‌‌ల)ను పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు ప్రాజెక్టుల ఇన్​ఫ్లో, ఔట్​ ఫ్లో కు సంబంధించిన వివరాలను ఈడీ సత్యనారాయణ వివరించారు. 

మూసీ అభివృద్ధి ఇలా...

మూసీ ప్రాజెక్టును పశ్చిమాన నార్సింగి ఔటర్​రింగ్​రోడ్​​నుంచి తూర్పున గౌరెల్లి ఓఆర్ఆర్​వరకూ 55 కి.మీ. మేర చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రాంతాల్లో మూసీలోని చెత్త, మురునీటిని, ఇతర వ్యర్థాలను తొలగించి మూడేండ్లలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయనున్నారు. దాదాపు రూ.60వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కన్సల్టెన్సీ పనులను సింగపూర్​కు చెందిన మ్యాన్​హర్డ్​కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ సంస్థ మూసీ ప్రక్షాళనతో పాటు సుందరీకరణ, అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి డీపీఆర్​ను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. 

షాపింగ్​ మాల్స్​, హోటల్స్​ మరెన్నో..

మూసీఅభివృద్ధిలో భాగంగా పరీవాహక ప్రాంతంలో షాపింగ్​ మాల్స్​, హోటల్స్​, పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లు, గ్రీన్‌‌‌‌‌‌‌‌వేలు, హాకర్‌‌‌‌‌‌‌‌జోన్లు, వంతెనలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్​ నగర రూపు రేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 

రెండు వైపులా రిటైనింగ్​ వాల్​..

మూసీ సుందరీకరణ తర్వాత నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ల నుంచి నీటిని వదలనున్నారు. దీని కోసం జంటజలాశయాల్లో ఎల్లప్పుడూ నీళ్లుండేలా గోదావరి రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఐదు టీఎంసీల నీటిని ఈ రెండు జలాశయాల్లోకి తరలించే ప్లాన్లు రూపొందించారు. అయితే సాధారణ రోజుల్లో మూసీలో ఎంత నీరు ప్రవహించే అవకాశం ఉంది? వర్షాకాలంలో భారీ వరదలు వస్తే ఏ మేరకు నీటి ప్రవాహం ఉంటుంది? నదికి ఇరువైపుల ఎంత దూరం వరకూ నీరు చేరే అవకాశం ఉందన్న విషయాలను కూడా ఉన్నతాధికారులు ఇంజినీరింగ్​ నిపుణులతో కలిసి చర్చించారు. దానికి అనుగుణంగానే నదికి ఇరువైపులా రిటెయినింగ్​వాల్​ నిర్మించే ప్రణాళిక ఉందని తెలిపారు.