
‘ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ ఉంటుంది, హాయిగా, రొమాంటిక్‌గా ఫీలవుతాం. అయితే ఆ పాట సందర్భం, ఎవరు పాడారు, ఎలాంటి లిరిక్స్ ఉన్నాయనేది కొత్త క్రియేషన్‌ను తీసుకొస్తుంది’ అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్. ఆయన సంగీతం అందించిన చిత్రం ‘హాయ్ నాన్న’. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హేషమ్ మాట్లాడుతూ ‘ ఇదొక సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్‌గా చేశాం.
ఇందులోని మ్యూజిక్ చాలా ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతతను ఇచ్చేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన గాజు బొమ్మ, సమయమా, అమ్మాడి, ఓడియమ్మ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ తెలిసిన, సహజంగా వాడుకలో ఉన్న పదాలతో ఉన్న పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయని నమ్ముతా. దర్శకుడు శౌర్యువ్ పాటల్ని అద్భుతంగా ప్రజంట్ చేశారు. సినిమా చూసినప్పుడు నేనే సర్‌ప్రైజ్ అయ్యా. పల్లవి ఒక చోట, చరణం మరోచోట చాలా అద్భుతంగా కుదిర్చారు.
ఓడియమ్మ పాటను హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్, హీరోయిన్ శ్రుతిహాసన్ చాలా బాగా పాడారు. మ్యూజిక్ పరంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించాం. వందకి వంద శాతం ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది’ అని చెప్పాడు.