థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్​ అది

థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్​ అది

ఒకప్పటి గడీల కాలాన్ని కళ్లకు కట్టిన  సినిమా ‘దొరసాని’. స్పేస్​లో​ ఉండే పరిస్థితుల్ని  తెర మీదకి తీసుకొచ్చింది ‘అంతరిక్షం’ సినిమా. అందమైన ప్రేమకథతో ఆకట్టుకుంది ‘మెంటల్​ మదిలో’. ఈ మూడు సినిమా కథలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నం. కానీ, డిఫరెంట్​ జానర్స్​లో వచ్చిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్​ పాయింట్​ ఉంది. అదే ప్రశాంత్​ ఆర్​ విహారి. కథనమే హీరోగా నడిచిన ఈ మూడు సినిమాలకి మ్యూజిక్​ ఇచ్చింది ఇతనే. కెరీర్​ స్టార్టింగ్​ నుంచే బ్యాక్ గ్రౌండ్​ స్కోర్​లో తనదైన మార్క్​ చూపిస్తున్న ఈ మ్యూజిక్​ డైరెక్టర్ మన తెలంగాణ పిలగాడే. 

అమ్మ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగం చేస్తోంది. నాన్న  బ్యాంక్​ మేనేజర్​. కానీ, ప్రశాంత్​కేమో చదువు, ఉద్యోగం కంటే పాటలే ఇష్టం. అందుకే బీటెక్​ చదివినా  మ్యూజిక్​ డైరెక్షన్​ వైపు అడుగులు వేశాడు. అతని ఆలోచనకి అమ్మానాన్న కూడా అండగా నిలిచారు. దాంతో చెన్నై ట్రైన్​ ఎక్కి ఎ.ఆర్.​ రెహమాన్​ కె.ఎమ్​ మ్యూజిక్​ కన్జర్వేటరి ( కెఎమ్​ఎమ్​సి)’లో జాయిన్​ అయ్యాడు. ఆ ఇని​స్టిట్యూట్​నే ఎందుకు ఎంచుకున్నానో తెలియాలంటే ‘రోజా’ సినిమా నుంచి కథ మొదలుపెట్టాలంటూ.. ఇలా చెప్పుకొచ్చాడు...

ఆ ఆలోచనే లేదు
‘‘మా ఫ్యామిలీలో ప్రొఫెషనల్​​ సింగర్స్​ ఎవరూ లేరు. కానీ, అందరూ శృతిలో పాడతారు. అమ్మానాన్న భజనలు బాగా పాడతారు. అవి వింటూ నేనూ పాడటం నేర్చుకున్నా. నా గొంతు  బాగుండటంతో నాన్న స్పెషల్​ ఇంట్రెస్ట్​ తీసుకుని,  రోజూ నాతో భజనలు ప్రాక్టీస్​ చేయించారు. చుట్టు పక్కల ఏ మ్యూజిక్​ కాంపిటీషన్​​ జరిగినా తీసుకెళ్లారు. కర్నాటక​ సంగీతంలోనూ  చేర్పించారు. కానీ, ఎప్పుడూ కుదురుగా ఒకచోట  కూర్చొని మ్యూజిక్​ నేర్చుకోలేదు నేను. ఒక ఆరు నెలలు కంటిన్యూస్​గా  క్లాస్​లకి వెళ్తే  మరో సంవత్సరం బ్రేక్​ ఇచ్చేవాడ్ని. దాంతో నలుగురైదుగురు గురువులు మారుతూ వచ్చారు నాకు.  అయితే సెల్​ఫోన్లు వచ్చిన కొత్తలో నాన్న నా పాటల్ని రికార్డ్​ చేసి వినిపించేవాళ్లు. ఆ ఎక్స్​పీరియెన్స్​ చాలా థ్రిల్లింగ్​గా అనిపించేది. అవి విని ఇంకా బాగా పాడాలనుకునేవాడ్ని. అయితే మ్యూజిక్​ని కెరీర్​గా చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో నా మైండ్​లో లేదు. కానీ,  ఏదైనా క్రియేటివ్​గా చేయాలనుకునేవాడ్ని. అదే నన్ను మ్యూజిక్​ వైపు నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. 

రెహమాన్​ ఇన్​స్పిరేషన్​తో.. 
ఒక పక్క పాటల్ని అంటి పెట్టుకొని ఉంటూనే.. వరంగల్​ కిట్స్​లో బీటెక్ పూర్తిచేశా. కానీ, ఆ తర్వాత నలుగురిలో ఒకడిలా ఉద్యోగం చేయాలనిపించలేదు. నాకిష్టమైన మ్యూజిక్​నే ప్రొఫెషన్​గా మార్చుకోవాలి అనుకున్నా. అందుకోసం చెన్నైలోని ఎ. ఆర్.రెహమాన్​ ఇని​స్టిట్యూట్​లో ట్రైన్​ అవ్వాలనుకున్నా. రెహమాన్​ గారి ఇని​స్టిట్యూట్​నే ఎంచుకోవడానికి కారణం ఆయనపై ఉన్న  అభిమానమే. ఊహ తెలిసినప్పట్నించీ నేను రెహమాన్​గారి పాటలే ఎక్కువగా వినేవాడ్ని. ముఖ్యంగా ఆయన మ్యూజిక్​లో వచ్చిన ‘రోజా’ నా ఆల్​టైం ఫేవరెట్​ ఆల్బమ్. ఆ సినిమాలోని‘పరువం వానగా..’ పాటంటే చాలా ఇష్టం. ఆయన ట్యూన్స్​ కట్టిన ‘దొంగ దొంగ’ సినిమాలోని పాటలంటే కూడా ఇష్టం. ఆ ట్యూన్స్​ విని ఇన్​స్పైర్​ అయి నేనూ మ్యూజిక్​ డైరెక్టర్​ అవ్వాలనుకున్నా. అందుకోసం ఆయన ఇని​స్టిట్యూట్​లోనే చేరాలనుకున్నా. ఇదే విషయం ఇంట్లో చెబితే అమ్మానాన్న కూడా ఓకే అన్నారు. కాకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు చేయమన్నారు. 

యూట్యూబ్​ నుంచి సినిమాల్లోకి...
ఆ ఆలోచనతోనే చెన్నై వెళ్లా. కానీ, అక్కడికెళ్లాక ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా పక్కనపెట్టి​ మ్యూజిక్​పైనే కాన్సన్​ట్రేట్​ చేశా. రెహమాన్​ స్కూల్​లో  పియానో నేర్చుకునేందుకు చేరా. నేను ఎంచుకున్నది  పార్ట్​ టైం కోర్స్​ కావడంతో  మిగిలిన టైంలో అదే ఇని​స్టిట్యూట్​లోని ‘సూఫీ ఎన్​సెబుల్’​ బ్యాండ్​లో మెంబర్​గా చేరా. రెహమాన్​ చేసిన కొన్ని సినిమాలకి కోరస్​లు కూడా పాడా. ఆ తర్వాత ​  మ్యూజిక్​ డైరెక్షన్​ ప్రయత్నాలు మొదలుపెట్టా. అదే టైంలో నా బీటెక్​ ఫ్రెండ్ విశ్వక్ ఎల్వీ ప్రసాద్​ ఫిల్మ్​ అకాడమీలో డైరెక్షన్​ కోర్సులో చేరాడు.  నా ట్యూన్స్​ విని ఎల్వీ ప్రసాద్​ అకాడమీలోని  తన ఫ్రెండ్స్ తీస్తున్న కొన్ని  షార్ట్ ఫిల్మ్స్​కి నన్ను రికమెండ్​ చేశాడు. లక్కీలీ అవన్నీ  ఓకే అయ్యాయి. ఆ వెంటనే  ఒక యూట్యూబ్​ ఛానెల్​ కోసం ఫేమస్​ తమిళ​ పోయెట్​ సుబ్రహ్మణ్య భారతి రాసిన పోయమ్స్​కి ట్యూన్స్​ కట్టా. ఆ ఆల్బమ్​ సూపర్​  హిట్​ అవడంతో  తెలుగులో నా డెబ్యూ మూవీ ‘వెళ్లిపోమాకే..’ డైరెక్టర్​ ​యాకూబ్​ అలీ కాంటాక్ట్​ అయ్యారు. అయితే ఆ సినిమాని ఫ్యూచర్​ ప్రాజెక్ట్స్​కి ఒక డెమోలానే అనుకున్నాం మేము. కానీ, ఆ సినిమా ట్రైలర్​ బాగా నచ్చడంతో హీరో నాని సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. అది చూసి దిల్​రాజు తన బ్యానర్​లోనే సినిమా రిలీజ్​ చేయడానికి ముందుకొచ్చారు. అలా సినిమాకి మంచి హైప్​ వచ్చింది.  

మొదటి అవకాశం
‘వెళ్లిపోమాకే’  ట్రైలర్​లో ఆర్.​ఆర్. ( రీ– రికార్డింగ్) ​ నచ్చి మధుర శ్రీధర్​రెడ్డి నన్ను ప్రొడ్యూసర్​ రాజ్​ కందుకూరికి పరిచయం​ చేశారు.  ఆయనకి కూడా నా మ్యూజిక్​ నచ్చడంతో ఆయన ప్రొడ్యూస్​ చేస్తున్న ‘మెంటల్ మదిలో’ సినిమాకి మ్యూజిక్​ డైరెక్టర్​గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలోని పాటలతో పాటు బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​కి కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా చూసి రాహుల్​ రవీంద్ర ‘చి. ల. సౌ’ సినిమాకి అడిగారు. ఆ తర్వాత చేసిన ‘అంతరిక్షం’, ‘దొరసాని’ సినిమాలు కూడా నా  కెరీర్​కి బాగా హెల్ప్​ అయ్యాయి. ఈ మధ్య రిలీజ్​ అయిన ‘రాజా విక్రమార్క’ సినిమా పాటలు కూడా నాకు మంచి గుర్తింపు ఇచ్చాయి. ప్రస్తుతం నేను మ్యూజిక్​ ఇచ్చిన ‘బొమ్మ బ్లాక్​ బస్టర్​’, ‘పంచతంత్రం’, ‘స్కైలాబ్’​  సినిమాలు రిలీజ్​కి రెడీగా ఉన్నాయి. ‘బేకర్​ అండ్​ బ్యూటీ’​ వెబ్​ సిరీస్​కి మ్యూజిక్​ చేసింది కూడా నేనే. అలాగే కెరీర్​ స్టార్టింగ్​లో కొన్ని హిందీ, తమిళ​, మలయాళం షార్ట్ ఫిల్మ్స్​కి మ్యూజిక్​ ఇచ్చా రెండు మిర్చి మ్యూజిక్​ అవార్డ్స్​ కూడా అందుకున్న​. 

కొత్తదనం చూడొచ్చు
కొత్త మ్యూజిక్​ డైరెక్టర్స్​ మీద త్వరగా ఒక ఒపీనియెన్​కి వచ్చేస్తుంది ఇండస్ట్రీ. ఇంతకుముందు చేసిన​ ప్రాజెక్ట్స్​ చూసి, ‘వీళ్లు ఇలాంటి మ్యూజిక్​ మాత్రమే చేయగలరు, వాళ్లు అలాంటి ప్రాజెక్ట్స్​ మాత్రమే​ డీల్​ చేయగలర’ని ఒక అంచనాకి వస్తారు. కానీ, ఏ మ్యూజిక్​ డైరెక్టర్​ అయినా కథని బట్టే మ్యూజిక్​ ఇస్తాడు. అది అర్థం చేసుకుని అప్​కమింగ్​ మ్యూజిక్​ డైరెక్టర్స్​ని ఎంకరేజ్​ చేస్తే మ్యూజిక్​లో కొత్తదనం వస్తుంది. అందుకు నేనే ఎగ్జాంపుల్​.. ‘వెళ్లిపోమాకే’ చూసి ‘అంతరిక్షం’ సినిమాకి  నన్ను సెలక్ట్​ చేశారు సంకల్ప్​ రెడ్డి. రెండూ డిఫరెంట్​ జానర్స్​ అయినా నా కంపోజింగ్​పై నమ్మకం ఉంచారాయన. ఆ నమ్మకాన్ని  నిలబెట్టేలానే నేను మ్యూజిక్​ చేశా అనుకుంటున్నా. అలా అప్​కమింగ్​ మ్యూజిక్​ డైరెక్టర్స్​ అందరికీ అవకాశాలు వస్తే మ్యూజిక్​లో మరెన్నో ఎక్స్​పరిమెంట్స్ చూడొచ్చు అని ముగించాడు ప్రశాంత్​. 

మార్కెట్​ ముఖ్యమే
మన తెలుగు సినిమా స్కేల్ రోజురోజుకి పెరుగుతోంది. దానికి తగ్గట్టే కొత్త కథలు వస్తున్నాయి. మ్యూజిక్​ కూడా కొత్త రంగులు అద్దుకుంటోంది. గత నాలుగైదేళ్ల నుంచి మ్యూజిక్​ చాలా మారుతోంది. అయితే పాట హిట్​ అయితే సినిమాకి ఎంత ప్లస్​ అవుతుందో.. సినిమా ఆడినా అందులోని పాటలకి అంతే హైప్​ వస్తుందనేది నా అభిప్రాయం. అలాగే  పాట పాడిన సింగర్​ మీద కూడా ఆ పాట రిజల్ట్​ ఆధారపడి ఉంటుంది.  మార్కెట్​ ఉన్న సింగర్​ పాడితే పాటలు త్వరగా జనాల్లోకి వెళ్తాయి. 

గుర్తింపు కోసం పనిచేయను 
ఫలానా పాటకో, సినిమాకో మ్యూజిక్​ కంపోజ్​ చేస్తే గుర్తింపు వస్తుందని నేను పనిచేయలేదు. అలా చేయను కూడా. మంచి కథాబలం ఉన్న సినిమాలకి మ్యూజిక్​ ఇవ్వాలనుకుంటున్నా. డిఫరెంట్​ జానర్స్​ ట్రై చేయాలనుకుంటున్నా. పర్సనల్​ లైఫ్​ విషయానికొస్తే 2020లోనే పెళ్లయింది. నా  బెటరాఫ్​ లలిత. తను సాఫ్ట్​వేర్​ ఇంజినీర్

హైలెట్​
 రెహమాన్​, ఇళయరాజా మ్యూజిక్​ ఎక్కువగా వింటుంటా. 
 డాక్యుమెంటరీలు​, సినిమాలు  బాగా చూస్తా. 
 వెజ్​లో ఏ వంటకం పెట్టినా తింటా. 
 కర్నాటక​  మ్యూజిక్​ బాగా వింటా.  
 సింగర్స్​ హరి హరణ్​, ప్రశాంత్, చిన్మయి, సిద్​ శ్రీరామ్​ గొంతులంటే చాలా ఇష్టం. 
::: ఆవుల యమున