
ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఉద్యోగులకు వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నాడు. ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన వెంటనే కంపెనీలో సగం మంది ఉద్యోగుల్ని తొలగించిన ఆయన.. రోజులు గడవక ముందే మరికొందరిని సాగనంపాడు. తాజాగా జరిగిన బోర్డు మీటింగ్ లో మరో 50శాతం మంది ఉద్యోగులను తొలగించాలని మస్క్ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి సోమవారానికల్లా రిపోర్టు రెడీ చేయాలని అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మస్క్ నిర్ణయంపై హెచ్ఓడీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు సమాచారం. ఇవాళ సాయంత్రానికి ఎంత మంది ట్విట్టర్ ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారన్న అంశంపై స్పష్టత రానుంది.
మస్క్ ఇటీవలే ‘కంపెనీలో కొనసాగాలని ఉందో, లేదో చెప్పాలంటూ కేవలం ‘ఎస్’ అనే ఆప్షన్ మాత్రమే ఇచ్చి ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించాడు. మస్క్ నిర్ణయాలతో విసుగెత్తిపోయిన ఉద్యోగుల్లో చాలా మంది జాబ్కు రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. కొత్త బాస్ నిర్ణయాలతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఉద్యోగులు ట్విట్టర్లో ‘రిప్ ట్విట్టర్’, ‘బై బై ట్విట్టర్’ అని హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవేవీ లెక్క చేయని ఎలాన్ మస్క్ మాత్రం తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు.