లాక్‌డౌన్‌ వేళ.. పెద్ద మనసు చాటుకున్న ముస్లిం యువకులు

లాక్‌డౌన్‌ వేళ.. పెద్ద మనసు చాటుకున్న ముస్లిం యువకులు
  • హిందూ మహిళ అంత్యక్రియల్లో.. ముస్లిం యువకులు
  • నెట్‌లో వైరల్‌ అయిన ఫొటోలు

భోపాల్‌: పక్షవాతంతో చనిపోయిన హిందూ వృద్ధురాలికి ముస్లింలు అంత్యక్రియలు చేసి తమ పెద్ద మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా  ఆమె బంధువులెవరూ రాలేక పోవడంతో పక్కింట్లో ఉండే ముస్లిం యువకులే దహన సంస్కారాలకు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటారు. శ్మశాన వాటిక వరకు ఆమె శవాన్ని తమ భుజాలపై మోసుకెళ్లారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌‌లోని సౌత్‌ టోడా ఏరియాలో ద్రౌపది భాయ్‌ అనే 65 ఏళ్ల వృద్ధురాలు పెద్ద కొడుకుతో కలిసి ఉంటోంది. కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆమె సోమవారం చనిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా బంధువలు ఎవరూ కనీసం చూసేందుకు కూడా రాలేదు.  శవాన్ని తరలించేందుకు వ్యాన్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో ముస్లిం యువకులే అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చారు. ముందు జాగ్రత్తగా మాస్కులు కట్టుకుని అన్ని  జాగ్రత్తలు పాటిస్తూ శ్మశానం వరకు 2.5 కిలోమీటర్లు వృద్ధురాలి శవాన్ని మోసుకెళ్లారు. కొంత మంది ఆ ఫొటోలను నెట్‌లో పెట్టడంతో అవి వైరల్‌ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ముసలమ్మ తమను సొంత బిడ్డల్లా చూసుకునేదని, ఆ ప్రేమతోనే ఈ పనిచేశామని అంత్యక్రియలు  చేసిన ముస్లింలు చెప్పారు. ఈ విషయంపై ఎంపీ మాజీ సీఎం కమల్‌నాథ్‌ స్పందించి వారిని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు.