పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే ఆవాలు ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటాయి. ఆవాల్లో ఫొటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్థాలు ఉంటాయి. అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి. ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతి పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాలలో విటమిన్– బి కాంప్లెక్స్ ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జీవక్రియలు బాగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతల్ని తగ్గిస్తాయి.

