- ఫాగింగ్, కెమికల్స్కూ చనిపోకుండా ముదురుతున్న దోమలు
- దోమల నర్వస్ సిస్టమ్‌ను హైజాక్ చేసి లక్షలకొద్దీ వైరస్ రెప్లికేషన్లు
- రక్తదాహం తీరకుండా సెలైవా గ్లాండ్స్ ఆధీనంలోకి..
- ఏడాదంతా బతికేలా నాలుగు రకాలుగా మార్పులు
- సీసీఎంబీ, ఐఐసీటీ స్టడీలో ఆందోళనకర విషయాలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరణ
హైదరాబాద్, వెలుగు:దోమల బెడద నివారించేందుకు సాయంత్రం కాగానే సిబ్బంది ఫాగింగ్ చేస్తుంటరు. నీటివనరుల మీద కిరోసిన్, కెమికల్ ద్రావణాలు పోస్తుంటరు. ఆ దోమలతో వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి రోగాలను కొంతైనా నియంత్రించాలన్నది అధికారుల తాపత్రయం. కానీ, ఇప్పుడు ఆ ఫాగింగ్, కెమికల్స్కూ డెంగ్యూ వైరస్ లొంగట్లేదంటే నమ్ముతారా..? హెచ్ఐవీ లాగానే ఈ డెంగ్యూ వైరస్కూడా తన రూపాన్ని మార్చుకుంటూ మహా మొండిఘటంగా పరిణమిస్తున్నది.
తనకు అనుగుణంగా దోమ మైండ్‌సెట్‌నే మార్చే స్తున్నదీ వైరస్. హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఐఐసీటీ సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కాప్రా, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల నుంచి వైరస్ శాంపిళ్లను సేకరించి అధ్యయనం చేసిన సైంటిస్టులు.. వైరస్‌లోని జన్యువులు మ్యుటేట్ అవుతున్నట్టు గుర్తించారు. ఫాగింగ్ చేసినా.. కెమికల్స్ చల్లినా దోమ చనిపోకుండా ఆ వైరస్ కాపాడుతున్నట్టు తేల్చారు. ఒక రకంగా డెంగ్యూ వైరస్‌ను మోసుకొచ్చే ఈడిస్ ఈజిప్టీ దోమలోని నర్వస్ సిస్టమ్‌ను హైజాక్ చేసేసి.. ఒక జాంబీలాగా ఆ దోమను మార్చేస్తున్నదని గుర్తించారు. ఏండ్లకొద్దీ చేస్తున్న రొటీన్ ఫాగింగ్‌కు ఇటు దోమ, అటు వైరస్ రెండూ కూడా అడ్వాన్స్ అయిపోయి వాటిని మార్చుకుంటున్నాయని చెప్తున్నారు.
పక్క దోమలకూ అంటిస్తున్నయ్..
డీలో మరో ఆందోళనకరమైన విషయం తేలింది. డెంగ్యూ దోమలు మొండిగా తయారవ్వడమేకాకుండా.. పక్కన ఉండే మామూలు దోమలకూ డెంగ్యూను అంటిస్తున్నట్టు వెల్లడైంది. ఫాగింగ్ వంటి చర్యలేవీ దానిని నిరోధించలేకపోతున్నాయని తేలింది. దోమను చావనివ్వకుండా ఆ వైరస్ తనను తాను మార్చుకుంటున్నదని, దోమలను అగ్రెసివ్‌గా మారుస్తున్నాయని స్టడీ వెల్లడించింది. దోమల నర్వస్ సిస్టమ్‌ను హ్యాక్ చేసి.. ఆ దోమ బయాలాజికల్ క్లాక్‌ను నాశనం చేసి వైరస్ చెప్పినట్టు నడుచుకునేలా సాధారణ దోమలను సైతం హంటింగ్ మెషీన్లుగా మారుస్తున్నాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. దోమ రక్తదాహం తీరకుండా ఆ దోమలోని సెలైవరీ గ్లాండ్స్‌ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటున్నదని తేలింది. ఒక వ్యక్తి లేదా చాలా మంది వ్యక్తుల నుంచి నిరంతరం రక్తాన్ని పీల్చేలా వైరస్ చేస్తున్నదని వెల్లడైంది. దీని వల్ల ఎక్కువ మంది డెంగ్యూ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మట్టుబెట్టడం కష్టమేనా?
వైరస్, దోమలను మట్టుబెట్టడం కష్టమేనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. ఏడాదంతా యాక్టివ్‌గా ఉండేలా నాలుగు వేర్వేరు వెర్షన్లుగా ఆ వైరస్ మారిపోతున్నట్టు స్టడీలో తేలింది. దీంతో స్థానికంగా ఉండే ఇతర దోమలను ఇన్ఫెక్ట్ చేస్తుండడంతో.. దానిని కంట్రోల్ చేయడం కష్టతరమవుతుందని చెప్తున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఒక్క చిన్న దోమలో లక్షలకొద్దీ ఆ వైరస్ రెప్లికేట్ అవుతుండడంతో అడ్డుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బయట ఉండే నీళ్లలోనే కాదు, ఇంట్లో ఉండే చిన్నపాటి మొత్తం ఉండే నీటిలోనూ డెంగ్యూ వైరస్ ప్రమాదకరంగా వృద్ధి చెందుతున్నట్టు చెబుతున్నారు. ఫ్రిజ్‌లోని డ్రిప్ ట్రేలు, కూలర్ ట్యాంకులు, పూల కుండీలు, ఇంటిపైన ఉండే వాటర్ ట్యాంక్, ఏసీ కండెన్సర్ పైపుల్లోనూ ఈ డెంగ్యూ దోమలు తమ జాతిని వృద్ధి చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు, ఆఫీసులు, ఇతర పబ్లిక్ ప్లేసుల్లోనూ ఈ డెంగ్యూ దోమలు పొంచి ఉంటున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
